8 July, 2026 | 2:40 AM

డిజిటలైజేషన్‌తో పారదర్శకత

08-07-2026 01:56 AM
  1. అన్ని విభాగాల్లో ఈ-గవర్నెన్స్ తప్పనిసరి 
  2. వంద రోజుల్లో కొలిక్కి తీసుకురండి
  3. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1న వేతనాలు
  4. రూల్స్ పాటించని ఏజెన్సీలపై చర్యలు  
  5. ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : పాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ తప్పనిసరి అని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని.. అందుకు సంబంధించిన వివరాలను డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, 100 రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని పేర్కొన్నారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ సైతం వర్తింపజేసేందుకు ఉద్యోగుల వివరాలను డిజిలైజ్ చేయాలన్నారు. నిరంతరం మానిటరింగ్ చేయడానికి ఆర్థికశాఖ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించాల్సిందే

రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, అందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీలకు  చెల్లింపులు చేస్తున్నా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.

ముఖ్యమంత్రి స్పందిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు తమ పరిధిలోని ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ తప్పనిసరిగా వర్తింపజేయాల్సిందేనని ఆదేశించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 1నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లించేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని, అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు.

సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ  వైస్ చైర్మన్ శాంతికుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్. శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.