రోడ్ల దుస్థితితో గ్రామస్తుల అవస్థలు
గద్వాల మండల గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
గద్వాల టౌన్, జూలై 31: గద్వాల మండలంలోని వెంగంపేట, తురుకోన్పల్లి, ములక లపల్లి, తెలుగోనిపల్లి, లత్తిపురం, బీరెల్లి, గుర్రంగడ్డ తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వాన్నంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో వా హనదారులు, ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇటీ వల కురుస్తున్న వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రహదారి ఎక్కడ, గుంత ఎక్కడో గుర్తించడం కష్టంగా మారిందని, దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిర్మించిన ఈ రహదారులకు ఇప్పటి వరకు కనీసం ప్యాచ్వర్క్ కూడా చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






