12 March, 2026 | 6:21 AM

ఇంధన సెగ.. గిగ్ కార్మికుల గగ్గోలు

12-03-2026 01:08 AM

ఎల్పీజీ, సీఎన్జీ కొరతతో కుదేలవుతున్న రవాణా, డెలివరీ రంగాలు

ప్రభావం.. రోడ్డెక్కలేని స్థితిలో ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు

గంటల కొద్దీ క్యూలైన్లలోనే గడుస్తున్న కాలం.. ఆవిరవుతున్న డ్రైవర్ల ఆదాయం

రెస్టారెంట్లలో గ్యాస్ కష్టాలతో పడిపోతున్న ఆర్డర్లు.. డెలివరీ కార్మికులపై తీవ్ర ప్రభావం

గిగ్ కార్మికులను అత్యవసర విభాగంగా గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలి.. టీజీపీడబ్ల్యూయూ డిమాండ్

హైదరాబాద్,సిటీ బ్యూరో మార్చి 11 (విజయక్రాంతి): పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం, అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పుడు నగర జీవనాడిపై దెబ్బకొడుతున్నాయి. ము ఖ్యంగా ఎల్పీజీ , సీఎన్జీ సరఫరాలో ఏర్పడిన కొరత గిగ్  ప్లాట్ఫాం కార్మికుల జీవనోపాధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కార్మికులు ఇంధనం దొరక్క రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ టీజీపీడబ్ల్యూయూ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రా న్స్పోర్ట్ వర్కర్స్ ఐఎఫ్‌ఎటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందిం చాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

క్యూలైన్లకే పరిమితమైన ఆదాయం

ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేసే డ్రైవర్లలో అత్యధికులు ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలపైనే ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని ఇంధన కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో, ప్రయాణాల సంఖ్య తగ్గి డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోతోంది.

నిర్వహణ ఖర్చులు భరించలేక, ఈఎంఐలు చెల్లించలేక డ్రైవర్లు సతమతమవుతున్నారని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాలో అంతరాయం ఇలాగే కొనసాగితే పట్ట ణ రవాణా వ్యవస్థ పూ ర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇంధన కొరత ప్రభావం కేవలం రవాణాపైనే కాకుం డా ఫుడ్ డెలివరీ రంగంపైనా తీవ్రంగా పడుతోంది.

ఎల్పీజీ కొరత వల్ల అనేక హోటళ్లు, రెస్టారెంట్లు  క్లౌడ్ కిచెన్లు ఆహార తయారీ సామర్థ్యాన్ని తగ్గించుకున్నాయి. దీంతో స్విగ్గీ, జోమాటో వంటి ప్లాట్ఫాంలలో ఆర్డర్ల సంఖ్య పడిపోయింది. ఇది నేరుగా డెలివరీ కార్మికుల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. ఒకవైపు గ్యాస్ దొరక్క తమ సొంత వాహనాలు నడపలేకపోతుంటే, మరోవైపు హోటళ్ల నుంచి ఆర్డర్లు రాకపోవడంతో డెలివరీ బాయ్స్ ఉపాధి కోల్పోతున్నారని ఐఎఫ్‌ఎటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అత్తినమొని నాగేష్ కుమార్ పేర్కొన్నారు.

గిగ్ ప్లాట్‌ఫాం ఎకానమీ వ్యవస్థ ఇంధన లభ్యత పట్ల అత్యంత సున్నితంగా ఉంటుందని, స్వల్పకాలిక కొరత కూడా వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తుందని యూనియన్లు స్పష్టం చేశాయి. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. అత్యవసర సేవలు అందించే కార్మికులుగా గుర్తించి, గ్యాస్ స్టేషన్ల వద్ద ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు డెలివరీ కార్మికులకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల దృష్ట్యా అగ్రిగేటర్ కంపెనీలు ఓలా, ఉబర్, స్విగ్గీ మొ.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని యూనియన్లు విజ్ఞప్తి చేశాయి.

ఇంధన కొరత వల్ల సేవల్లో అంతరాయం కలిగితే డ్రైవర్లపై జరిమానాలు విధించడం లేదా వారి ఖాతాలను బ్లాక్ చేయడం వంటి చర్య లు తీసుకోకూడదని కోరాయి. అదనపు ఖర్చులను భర్తీ చేసేందుకు తాత్కాలిక ప్రో త్సాహకాలను ప్రకటించాలని, కార్మికులకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే గిగ్ కార్మికుల జీవనోపాధిని రక్షించడం ప్రభుత్వాలు కంపెనీల కనీస బాధ్యతని వారు గుర్తు చేశారు.