22-01-2026 05:18:08 PM
సర్పంచ్ చునార్క సతీష్
వాంకిడి,(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మురికి కాలువల్లో చెత్త వేయకుండా శుభ్రత పాటించాలని వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చునార్క సతీష్ గ్రామస్తులకు సూచించారు. గురువారం గ్రామపంచాయతీ పరిధిలోని మాండోకర్‌వాడలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్‌తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం వల్ల మురుగు నీరు సరిగా ప్రవహించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ సఫాయి కార్మికులతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
మాండోకర్‌వాడలోని మురికి కాలువలను శుభ్రం చేయించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, కాలువల్లో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సర్పంచ్ తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్, సఫాయి కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.