01-07-2025 12:31:20 AM
వరంగల్ (మహబూబాబాద్), జూన్ 30 (విజయ క్రాంతి) : వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ‘విరోధిని’ గాను షోడశీ క్రమాన్ని అనుసరించి ‘వహ్నివాసిని’ గా అంకరించి పూజారాధనలు నిర్వహిం చారు.
విరోధిని నిత్య అమ్మవారు భక్తులకు శత్రు విజయము కలిగించును. వహ్నివాసిని కర్మఫలప్రాప్తి కలిగించుటయేగాక ఐశ్వర్యాభి వృద్ధి కల్గించునని ఆలయ ప్రధానార్ధకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి వసతి, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, నార్ల సుగుణ, ఈఓ శ్రీమతి శేషుభారతి పర్యవేక్షిం చారు.
శ్రీ మాతా,లలితాంబికా సేవా సమితి వారి ఆధ్వర్యవములో వరంగల్ మహా నగరంలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్లోని పలు ప్రాంతాలకు చెందిన నారీమణులు ఆషాడ శుద్ద పంచమి పురస్కరించుకొని వందలాదిగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు.
పంచమి తిథి కావడంతో పంచమీ పంచభూతేషి పంచతన్మాత్రసాయికా అని లలితా సహస్రనామ ప్రమాణం, పంచభూ తములకు ఈ జగన్మాతయే అధినాయకి, ఈ రోజు అమ్మవారికి సారె సమర్పించడవం వల్ల పంచభూతములకు ప్రీతి కలిగి ప్రకృతి సమతౌల్యం కలిగి ఉండి ప్రాణి కోటి సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముత్తయిదువులు అమ్మవారికి సారె సమర్పిస్తారని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.