01-07-2025 11:16:45 AM
కర్ణాటక: బెంగళూరులోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్టోరియా(Victoria Hospital) ఆసుపత్రిలో మంగళవారం అగ్నిప్రమాదం(Bengaluru Hospital Fire) సంభవించింది. ఆసుపత్రిలోని కాలిన గాయాల వార్డులో ఈ ప్రమాదం జరిగింది. 26 మంది ఇన్‌పేషెంట్లను సురక్షితంగా మరొక బ్లాక్‌కు తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బర్న్స్ వార్డులో స్విచ్‌బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఒక మంచం, రిజిస్టర్ పుస్తకం, ఇతర పరికరాలు కాలిపోయాయి. మంటలు, పొగ కాలిన గాయాల వార్డు గ్రౌండ్ ఫ్లోర్‌ను చుట్టుముట్టాయి. రాత్రిపూట విధుల్లో ఉన్న డాక్టర్ దివ్య మంటలను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
ఆసుపత్రి సిబ్బంది 26 మంది రోగులను సురక్షితంగా హెచ్ బ్లాక్‌లోని మరొక వార్డుకు తరలించారు. సంఘటన జరిగిన సమయంలో కాలిన గాయాల వార్డులో 14 మంది పురుషులు, ఐదుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఇన్‌పేషెంట్లుగా ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి సెమినార్ హాలులో మంటలు, పొగలు వస్తున్నట్లు డాక్టర్ దివ్య మొదట గమనించారని, వెంటనే ఆమె తన సహోద్యోగులకు సమాచారం అందించి, తరలింపు ప్రక్రియను ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను(Hospital Superintendent) కూడా సంప్రదించి పోలీసులకు, అగ్నిమాపక నియంత్రణ గదికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఐసియులో చికిత్స పొందుతున్న రోగులతో సహా తరలింపు 30 నిమిషాల్లో పూర్తయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.