03-05-2025 01:01:45 AM
తిరువనంతపురం, మే 1: కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇవాళ తన పక్కనే ఉన్నారని.. దీనివల్ల కొంతమందికి నిద్రపట్టక పోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌నుద్దేశించి చురకలంటించారు. కేరళలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ. 8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్సస్ సీ పోర్టును ప్రధాని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ హాజరయ్యా రు. అంతకుముందు గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధాని మోదీకి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో శశిథరూర్ ఘన స్వాగతం పలికారు.
ఓడరేవు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనతో పాటు వేదికపై ఉండడం కొందరికి నచ్చకపోవచ్చన్నారు. కానీ ఆయన ఇవాళ మాత్రం తన పక్కనే ఉన్నారని, దీనివల్ల కొందరికి నిద్రలేని రాత్రులు ఉంటాయన్నారు.
ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికే చేరుకుంటుందని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. ఈ సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్ పక్కనే ఉండటం గమనార్హం. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో శశిథరూర్ బంధం బీటలు వారుతున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఒక కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై శశిథరూర్ స్పందిస్తూ.. తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధాన మంత్రిని ప్రొటోకాల్ ప్రకారమే సాదరంగా స్వాగతించాను తప్ప దీనిలో రాజకీయం లేదన్నారు.
కాగా భారత సముద్ర వాణిజ్య చరిత్రలో విజింజం అంతర్జాతీయ ఓడరేవు సముద్ర రవాణాకు కీలకంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాత ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది.