03-05-2025 01:03:37 AM
మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కృష్ణా నదీజలాల పున:పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఖరారు చేసేందుకు ఈనెల 7న కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఈ ఉత్తర్వులను తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, ఆ కేటాయింపులను ఇప్పు డు ఒప్పుకుంటే తెలంగాణకు గొడ్డలిపెట్టు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆల్మట్టిలో 10 టీఎం సీల నీరు వదులు కొనేందుకు కింది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిందని, అయితే ఆల్మట్టిలో అలా నీళ్లు నింపు కొనేందుకు ఆ డిజైన్ సరిపోదని, దీనితో జురాల ప్రాజెక్టు ఎండిపోతుందన్నారు.
ఏడాదిన్నరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మన్ను ఎత్తని ప్రభుత్వ వైఖరి దేనికి నిదర్శనమన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకొనే సీఎం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం మాతృద్రోహం కాదా అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.