షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలి
- మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు
గజ్వేల్,(విజయక్రాంతి): మహిళల భద్రత కోసం షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రైతు వేదికలో నిర్వహించిన షీ టీం అవగాహన సభలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు మాట్లాడుతూ, మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా షీ టీం సేవలను సద్వినియోగం చేసుకుని ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళల రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా షీ టీంలను ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళలకు భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించడం, వేధింపులను అరికట్టడం, బాధితులకు అండగా నిలవడం షీ టీం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా షీ టీం స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు మహేష్, ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలపై షీ టీం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. అలాగే బైక్ రేసింగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న యువతకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






