రాహుల్ ప్రధాని అయితే తప్పేంటి?
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
ముంబై, జూన్ 5: భవిష్యత్తులో అవకాశం వస్తే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్పేంటని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆయన కనుక నాయకత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అడ్డు కోవడానికి తామెవరమని అడిగారు. ‘రాహుల్ గాంధీ కనుక లీడర్‌షిప్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అడ్డుకునేందుకు మేం ఎవరం. జాతీ య నేతగా ఆయన చాలా సార్లు నిరూపించుకున్నారు. దేశంలో ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు. ఆయన మనందరికీ కావాలి. ఆయనంటే మాకు చాలా ప్రేమ ఉంది. కూటమిలో కూడా ఆయన ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు’ అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా తమకు ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి ఆలోచన లేదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉమ్మడి లక్ష్యంతో పనిచేశామని పేర్కొన్నారు.






