20 March, 2026 | 9:34 AM

అదనపు కమిషనర్ల కరువు!

20-03-2026 01:16 AM
  1. మూడు కార్పొరేషన్లలో 8మందే
  2. జీహెచ్‌ఎంసీలో ఇద్దరితోనే సరి
  3. జోనల్ కమిషనర్లపై అదనపు బాధ్యతలు
  4. ఒక్కొక్కరికి 3-4 శాఖల భారం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధానితో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన కీలక నగరపాలక సంస్థలు ప్రస్తుతం అధికారుల కొరతతో అల్లాడుతున్నాయి. మూడు ప్రధాన కార్పొరేషన్లలో జీహెచ్‌ఎంసీ సహా పాలనను పర్యవేక్షించాల్సిన అడిషనల్ కమిషనర్ల సంఖ్య కనిష్ఠ స్థా యికి పడిపోయింది. ప్రస్తుతం మూడు చో ట్లా కలిపి కేవలం ఎనిమిది మంది అడిషనల్ కమిషనర్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, కీలక విభాగాల మధ్య సమన్వయం లోపించి పనులు ముందుకు సాగడం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కేవలం ఇద్దరు అడిషనల్ కమిషనర్ల తోనే నెట్టుకొస్తుండటం పాలనా యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి కా ర్పొరేషన్‌లో పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్, ఐటీ, హెల్త్, ఇంజినీరింగ్ వంటి కనీసం 8 కీలక విభాగాలు ఉంటాయి. గతంలో జీహెచ్‌ఎంసీ ఒక్కటే ఉన్న సమయంలోనే దాదాపు 9 మంది అడిషనల్ కమిషనర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పనిభారం పెరిగినా అధికారులు మాత్రం కరువ య్యారు.

ప్రస్తుతం ఉన్న కొద్దిమంది అడిషనల్ కమిషనర్లకే పలు శాఖల బాధ్యతలను అప్పగించగా, మిగిలిన విభాగాలకు జోనల్ కమిషనర్లే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో జోనల్ కమిషనర్ తన సొంత బాధ్యతలతో పాటు అదనంగా 3 నుంచి 4 శాఖల ను పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో ఏ శాఖ కూ వారు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా ఫైళ్ల కదలిక మం దగించి, ప్రజలకు అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

అడిషనల్ కమిషనర్ల ప్రధాన బాధ్యత సర్కిల్, జోనల్ స్థాయి అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ ఆయా విభాగాల పనితీరును సమీక్షించడం. క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పాలసీ నిర్ణయాలను అమలు చేయడం వీరి పని. అయితే, అధికారుల కొరత కారణంగా ఈ సమన్వయం పూ ర్తిగా కొరవడింది.

ఒక శాఖ నిర్ణయంపై మ రో శాఖకు స్పష్టత లేకపోవడం, ఫైళ్లు ఒక టే బుల్ నుంచి మరో టేబుల్‌కు వెళ్లడానికి వా రాల సమయం పడుతుండటంతో ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోంది. పాత జీహెచ్ ఎంసీ సమయంలో ఉన్న నిబద్ధత, వేగం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు అధికారులు బదిలీఅవ్వడం లేదా ఇతర విభాగా లకు వెళ్లడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.