11-05-2025 12:00:00 AM
పచ్చిమిర్చి వాడకుండా వంట చేయడం అంత సులువు కాదు. ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చిలో ఘాటు కాస్త తక్కువే ఉంటుంది. అందుకని చాలామంది కారం కోసం పచ్చిమిర్చినే అధికంగా వాడతారు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఐదు రోజులైనా దాదాపు ప్రతిఒక్కరూ పచ్చిమిర్చిని కచ్చితంగా ఏదో రూపంలో తీసుకుంటారు. అసలు పచ్చిమిర్చి ఆరోగ్యానికి మంచిదేనా? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
* పచ్చిమిర్చి (గ్రీన్ చిల్లీ) ఆహారానికి కారం రుచిని అందిస్తాయి. ఇందులో యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, క్యాప్సుసైస్ అనే పదార్థం ఉంటాయి. పచ్చిమిర్చిలోని విటమిన్ సి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా క్యాన్సర్ ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.
* ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరం నుంచి క్యాలరీలను బర్న్ చేయడానికి పనిచేస్తుంది. బరువు తగ్గేవారికి మిరపకాయలు ప్రయోజనకరంగా ఉంటాయి.
* పచ్చిమిర్చి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి.
* పచ్చిమిరపకాయలు కళ్ల ఆరోగ్యానికి చాలామంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది తింటే కళ్లలో చికాకు తగ్గుతుంది. కంటి చూపు బలహీనంగా ఉన్నవారికి పచ్చిమిర్చి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
* పచ్చి మిరపకాయ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త నాళాలలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
* పచ్చిమిర్చిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.
* పచ్చిమిర్చి అతిగా తింటే కడుపులో మంట, అల్సర్ లేదా అసిడిటీ సమస్యలు వస్తాయి. కొందరికి ఇది తింటే అలర్జీ రావచ్చు. ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో పచ్చిమిరపకాయలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.