29 August, 2026 | 10:53 PM

మధిరలో హత్య కేసు చేదించిన పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్ట్

29-08-2026 10:20 PM

హత్య విషయం తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వని మరో ఇద్దరిపై కేసు

ఏసీపీ వైరా ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు

మధిర,(విజయక్రాంతి): ఆగస్టు 10 న ఆత్కూరు రోడ్డులోని పీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌ ఎదురుగా కాసర్ల వెంకటేశ్వరరావు బ్రిక్స్‌ కంపెనీకి వెళ్లే బండ్ల దారిలో జరిగిన హత్య కేసును మధిర టౌన్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ, వైరా తెలిపారు. ఈ ఘటనపై మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 144/2026, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(1) కింద కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్‌కు చెందిన ఎండీ తాలీమ్‌ (45), వృత్తిరీత్యా టైలర్‌, ఆగస్టు 10న రాత్రి బ్రిక్స్‌ కంపెనీ వద్దకు వెళ్లాడు.

అక్కడ గుంజి రాములమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో గద్దల జమలయ్య  ఏపోబు అతడిపై కర్రతో పలుమార్లు దాడి చేయడంతో తాలీమ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాములమ్మ మృతుడి సెల్‌ఫోన్‌ను తీసుకోగా, ఇద్దరూ కలిసి హత్యకు ఉపయోగించిన కర్ర, సెల్‌ఫోన్‌ను జలుగుమాడు ప్రాంతంలోని గదికి తీసుకెళ్లి దాచిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్య విషయం కంపెనీ యజమాని కాసర్ల వెంకటేశ్వరరావు, అతని పెద్దల్లుడు పేరయ్యలకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిందితులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ఉపయోగించిన కర్రను దాచిపెట్టాలని చెప్పడంతో పాటు, జమలయ్య ఫోన్‌లోని కాల్‌లిస్ట్‌లోని కొన్ని నంబర్లను తొలగించినట్లు గుర్తించారు. దీంతో కాసర్ల వెంకటేశ్వరరావు, పేరయ్యలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి సెల్‌ఫోన్‌, రక్తపు మరకలు ఉన్న నిందితుడి దుస్తులు, నిందితుడి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ, వైరా తెలిపారు.