29 August, 2026 | 10:54 PM

యూరియా యాప్‌ను తక్షణమే ఎత్తివేయాలి

29-08-2026 10:22 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం యూరియా కొనుగోలుకు ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు గొర్రెపాటి వీరస్వామి, కార్యదర్శి అచ్చ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. వర్షాలు, సాగు పనులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు యాప్‌ విధానం మరో సమస్యగా మారిందన్నారు.

యాప్‌లో వివరాల నమోదు, సర్వర్‌ సమస్యలు, ఆధార్‌ అనుసంధానం కారణంగా రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి యూరియా అందక పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని, యాప్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.