calender_icon.png 14 July, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊర్లో ఉండాలా..?

14-07-2025 12:00:00 AM

-కాళీ చేసి వెళ్లాలా...

-పురుగులతో ఏగ లేకపోతున్నాం

-అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్థుల ఆందోళన 

-ఎఫ్‌సీఐ గోదాంలో ఉన్న బియ్యం 

-పురుగులతో గ్రామస్థుల అవస్థలు పట్టించుకోని.. అధికారులు 

-ఆవేదన వ్యక్తం చేస్తున్నగ్రామస్థులు 

కామారెడ్డి, జులై 13 (విజయ క్రాంతి); పురుగులు బాబోయ్.. పురుగులు... ఎక్కడ చూసినా... గ్రామస్తుల పైన పురుగు లే పురుగులు... ఇవన్నీ ఎక్కడినుండి వచ్చాయని అనుకుంటున్నారా.. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎఫ్ సి ఐ గోదాం లలో నిల్వ ఉన్న రేషన్ దొడ్డు బియ్యం పురుగుల పాలయ్యాయి. ఆ పురుగులు గ్రామంలో వ్యాప్తి చెందాయి. దీంతో కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి మేజర్ గ్రామంలో బియ్యం పురుగులతో గ్రామస్తులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గోదాముల యజమాని దృష్టికి గ్రామస్తులు పురుగుల సమస్య తీసుకెళ్తే తాను స్థానికంగా లేనని మలేషియాలో ఉన్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు. పురుగులతో తాము ఏగలేకపోతున్నామని గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చే పరిస్థితిని నెలకొందని గ్రామస్తులు ఆదివారం విజయక్రాంతి ప్రతినిధి తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని చూసినా పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు.

గుట్టలు గుట్టలుగా పురుగులు వస్తున్నాయి. ఎఫ్ సి ఐ బియ్యం గోదాములలో నిలువలు ఉండి పోవడంతో పురుగులు తయారయ్యాయి. దొడ్డు బియ్యం పంపిణీ చేయకపోవడంతో గోదాములలో నిల్వ ఉన్నాయి. పురుగులు ఏర్పడి గ్రామస్తులను కాటు వేస్తున్నాయి. ఇంట్లో ఎక్కడ చూసినా పురుగులే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే ఊరు కాళీ చేసి వెళ్లి పోవాల్సి వస్తుందని గ్రామస్తు లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి పురుగుల పీడ తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎవరి ఒంటిపైన చూసిన పురుగులు వాలుతున్నాయి. వంట పాత్రల్లో సైతం పురుగులు వచ్చి చేరుతున్నాయి. పురుగులు బాబాయ్ పురుగులు అంటూ  గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురుగుల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగు వన్ స్పందించి పురుగుల బెడదను నివారించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరుతున్నారు.