అక్రమ కేసులకు వ్యతిరేకంగా బిజినేపల్లి ఠాణా ముట్టడి
బిజినేపల్లి జూన్ 05: ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తలలు పగిలేలా కొట్టినా, ఆర్థిక నేరాలకు పాల్పడిన ఏలాంటి కేసులు నమోదు కావడం లేదని, అవతలి పార్టీ నాయకులపై చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబేడుతున్నారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులకు నిరసనగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బిజినేపల్లి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జోనల్ ఇంచార్జులు అంతటి నాగన్న, పృథ్వీరాజులు మాట్లాడుతూ... లట్టుపల్లి గ్రామానికి చెందిన గట్టుకాడి శ్రీనివాస్, ఖానాపూర్ గ్రామానికి చెందిన రాము, లక్ష్మి దంపతులపై అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అక్రమ కేసు నమోదు చేశారని, ఈ కేసులపై బీఎస్పీ పార్టీ ఆద్వర్యంలో న్యాయపరంగా పోరాడుతామన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమ కేసులు పెడితే మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమైందో, ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నమోదు అవుతున్న అక్రమ కేసులపై భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా పోరాడుతామని పేర్కొన్నారు. బహుజనులపై అక్రమ కేసుల పరంపర ఆగకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు పానుగంటి రాంచందర్, పార్లమెంట్ ఇంచార్జ్ సి. కళ్యాణ్, కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ మునిస్వామి, బీఎస్పీ నాయకులు బాలు, పుట్టపాగ విష్ణు, బొల్లి కురుమయ్య, భాస్కర్, ఆంజనేయులు, శివకృష్ణ, బాలరాజు, శంకర్, వెంకటేష్, శ్రీను, మల్లేష్, శ్రీకాంత్, శ్రీహరి, నాగేష్, రామకృష్ణ, అశోక్, చిరంజీవి, విజయ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.






