16 April, 2026 | 3:50 PM

మౌనమే సారంగిలా మోగిందిలే..

15-06-2025 01:12 AM

నరేశ్ అగస్త్య హీరోగా దర్శకుడు విపిన్ రూపొందిస్తున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాను సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రబియా ఖటూన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ కాగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘సౌండ్ ఆఫ్ లవ్’ విడుదలతో మేకర్స్ మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు.

‘ఒక మెరుపు మెరిసిందిపుడే చిరునవ్వుగా.. ఒక చినుకు కురిసిందిపుడే సిరిమువ్వగా.. చిరుగాలిలో చిగురాకులా ఊగిందిలే ఈ ప్రాణం.. తడినేలపై గిలిగింతగా ఉరికిందిలే ఈ పాదం.. కవ్వింతలో ఈ కాలమే ఆడిందిలే ఇంధోలమే.. తొలిపిలుపు తగిలిందిపుడే పులకింతగా.. తొలిమలుపు తిరిగిందిపుడే సరికొత్తగా.. చిరుజల్లులో హరివిల్లులా విరిసిందిలే ప్రాయం.. సెలయేటిలో అల పాటలా వినిపించెలే ఓ రాగం.. లోలోపలా ఓ మౌనమే సారంగిలా మోగిందిలే..’ అంటూ కవితాత్మకంగా సాగుతున్న ఈ పాట అటు సంగీత ప్రియులను, సాహిత్యాభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ఈ గీతాన్ని జస్టిన్ ప్రభాకరన్  స్వరపర్చగా, రెహ్మాన్ రాసిన ఈ పాటను ఎస్పీబీ చరణ్, షాషా తిరుపతి ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మోహనకృష్ణ; ఆర్ట్: తోట తరణి; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్.