సింగరేణి కళాకారులు కోలిండియా పోటీల్లో రాణించాలి
ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిశాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలోని కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆధ్యాంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. పోటీల అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ ఏరియా ఉన్నతాధికారులు, యూనియన్ ప్రతినిధులతో కలిసి హాజరై, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి కళాకారులు, క్రీడాకారులు కోలిండియా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో, సాంస్కృత కార్యక్రమాల్లో రాణించి, సింగరేణి ఖ్యాతిని చాటాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల ఉద్యోగుల సంక్షేమ కొరకు నిరంతరం కృషి చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య విషయంలో, శారీరక, మానసిక ఉల్లాసం కొరకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కంపెనీ లెవెల్ సాంస్కృతిక పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని హర్ష్యం వ్యక్తం చేశారు. గెలుపొందిన కళాకారులు కోలిండియా స్థాయి పోటీల్లో తమ ప్రతిభ ప్రావీణ్యాలను కనబరిచి, బహుమతులు సాధించి, సింగరేణికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని కోరారు.
ఫోక్ డాన్స్ లో మందమర్రి, బెల్లంపల్లి ఏరియా ఎన్ శ్రీనివాస్ బృందం మొదటి బహుమతి గెలుపొందడం సంతోషకరమని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా క్రీడల గౌరవ కార్యదర్శి, సీనియర్ పిఓ ఎం కార్తీక్, ఏరియాల క్రీడా సూపర్వైజర్లు డి జాన్ వెస్లీ, సిహెచ్ అశోక్, ఎం నరేందర్ రెడ్డి, పరస శ్రీనివాస్, హెచ్ రమేష్, ఏరియా క్రీడల సంయుక్త కార్యదర్శి శివకృష్ణ, అన్ని ఏరియాల కల్చరల్ కోఆర్డినేటర్లు, కళాకారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.






