calender_icon.png 4 May, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి త్రైమాసికంలో 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలి

03-05-2025 08:28:23 PM

1200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించాలి..

అన్ని ఏరియాల సమీక్ష సమావేశంలో సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్..

ఇల్లెందు (విజయక్రాంతి): ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తికి పూర్తిగా అనుకూలంగా ఉండే మొదటి త్రైమాసిక కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 1200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఏరియాల జనరల్ మేనేజర్ లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన అన్ని ఏరియాల సమీక్ష సమావేశంలో ఆయన ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో సాధించిన బొగ్గు రవాణా 5.66 మిలియన్ టన్నులపై  2.7 శాతం వృద్ధితో ఈ ఏప్రిల్ లో 5.81 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించామని, అలాగే గత ఏడాది ఏప్రిల్ నెలలో సాధించిన 36.18 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పై 10.6 శాతం వృద్ధితో ఏప్రిల్ లో 40 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబి తొలగించామని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ లక్ష్యాలు సాధించాలని ఛైర్మన్ సూచించారు.

ఒడిశా రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకులో  పనిచేసేందుకు సూపర్వైజర్ సిబ్బందిని ఎంపిక చేసి నెల రోజుల్లోగా అక్కడికి పంపించాలని ఆదేశించారు. కొత్తగా నియమించబడిన ఉద్యోగులను భూగర్భ గనుల్లో పనిచేసే విధంగా పోస్టింగులు ఇవ్వాలని కోరారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగినిల సంఖ్య పెరిగిన రీత్యా వీరి నిర్వహణలో నడిపించడానికి ఒక ఓపెన్ కాస్ట్ గనిని, ఒక భూగర్భ గనిని ఎంపిక చేయాలని, ముందుగా ఒక పూర్తి షిఫ్టును కేవలం మహిళల చేతనే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు రవాణా మరియు నాణ్యతపై కూడా ఆయన సమీక్షించారు. నాణ్యత సరిగా లేనట్లయితే బొగ్గు అమ్మకాలు కుంటుబడతాయని, వినియోగదారులు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు.

కనుక నాణ్యతపై కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా పూర్తి పనిగంటలు సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (పీపీ మరియు పర్సనల్)  కె.వెంకటేశ్వర్లు, జీఎం (సీపీపీ) ఎ.మనోహర్, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ చంద్ర పరిగెన్,  జీఎం మార్కెటింగ్ రాజశేఖర రావు, కార్పొరేట్ జీఎం లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.