సింగరేణి కార్మికురాలికి లైంగిక వేధింపులు
- క్లర్క్, అధికారి, యూనియన్ నేత నిర్వాకం
- విషయం బయటపడడంతో బేరసారాలు
- బెల్లంపల్లి ఏరియాలో వెలుగు చూసిన ఘటన
మంచిర్యాల, జూన్ 19 (విజయక్రాంతి): ఆమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు.. కారుణ్య నియామకంలో భాగంగా ఆమె సింగరేణిలో కొలువు పొందింది. ఆమెపై ఓ క్లర్క్, ఓ అధికారి, ఓ కార్మిక సంఘం నేత కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు కాళ్లబేరానికి దిగారు. బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని గని పరిధిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ కార్మికురాలు పనిచేస్తోంది. ఆమెను కొద్దిరోజులుగా ఓ సింగరేణి ఉన్నతాధికారి ఒకరు ఇంటికి రావాలని, ఓ కార్మిక సంఘం నేత తనతో కనీసం గంటైనా గడపాలని, ఓ క్లర్క్ తనకు లోబడాలని వేధిస్తున్నారు.
వేధింపులకు తాళలేని కార్మికురాలు తోటి కార్మికులతో గోడు వెళ్లబోసుకున్నది. దీంతో కార్మికులు సదరు ఉన్నతాధికారి, క్లర్క్, కార్మిక సంఘం నేతను నిలదీయడంతో వారు కాళ్లబేరానికి దిగారు. ఆ సమస్య నుంచి బయటపడడానికి బేరాసారాలకు మొదలు పెట్టారు. ఒంటరి మహిళ అనే జాలి లేకుండా ఆమెను వేధిస్తున్న కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.






