బీజేపీ కొత్త బాస్ ఎవరు?
- పోటీపడుతున్న నేతలు
రాష్ట్రంలో కమల దళం పుంజుకోవడమే కారణం
ఢిల్లీలో జోరుగా లాబీయింగ్
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): గతంలో ఎప్పుడూ లేని విధంగా అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ పోరులో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి బాగా పట్టున్న రాష్ట్రాల్లోనే బోల్తా కొట్టిన నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు దక్కడంతో పార్టీ అధిష్ఠానం సైతం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు, పార్టీ స్థాయి ఒక్క సారిగా పెరగడంతో అధ్యక్ష పదవిని ఎలాగైనా పట్టాలనే ఉద్దేశంతో నేతలు కనిపిస్తున్నారు. గతంలో టికెట్లు లభించనివారు, ప్రస్తుతం గెలిచిన ఎంపీల్లో మంత్రిపదవి రాని వారు పార్టీ చీఫ్ కావాలని భావిస్తున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలతో టచ్‌లో ఉంటూ పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. మరికొందరు నేతలు ఆర్‌ఎస్‌ఎస్ నేతల ద్వారా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష పదవిని పట్టి పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు, పెద్ద పదవులు లభిస్తాయనే ఆశలో నేతలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్ఠానం సైతం ఎవరికి పదవి ఇస్తే బాగుంటుందనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
కసరత్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్ఠానం సిద్ధమైంది. కేంద్ర మంత్రి వర్గంలో పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షునికి సైతం చోటు లభించింది. తెలంగాణ, బెంగాల్, బీహార్, గుజరాత్, హర్యానా రాష్ర్ట అధ్యక్షులను మార్చనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి కావడంతో మరో నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను అధ్యక్షుడిగా నియమించి బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయాలని ఆలోచిస్తోంది. తద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని అంచనా వేస్తోంది.
మరోవైపు దక్షిణ తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి దీటుగా ముందుకెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో రాష్ర్ట పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలు. చక్కటి వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలోనూ ఆయన ముందు వరుసలో ఉంటారు.
పనిచేసేవారికే అవకాశమివ్వాలి
పార్టీని అంటిపెట్టుకుని సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేసిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు నేతలు అంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చి టికెట్లు కట్టబెట్టారని కొందరు గుర్రుగా ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్ర శాఖలో వివిధ పదవులు నిర్వహించిన రామచందర్‌రావు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ లాంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. గ్రూపులు కట్టేవారికి కాకుండా అందరినీ కలుపుకుపోయే వారికి అవకాశమివ్వాలని పలువురు భావిస్తున్నారు. బంగారు లక్ష్మణ్ తరువాత అధ్యక్ష పదవి దళితులకు ఇవ్వలేదు. ఈసారి దళితులకే పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.






