27-11-2025 12:00:00 AM
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీ చేపట్టిన ‘సర్’ ప్రక్రియను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. తాజాగా మంగళవారం బన్‌గావ్‌లో ‘సర్’ను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు.
బీహార్‌లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియ వల్లే అక్కడ ప్రతిపక్ష కూటమి ఓడిపోయిందని, బీహార్‌లో చేసినట్లే బెంగాల్‌లో చేస్తామంటే కుదరదని, బెంగాల్‌లో ఒక్క నిజమైన ఓటర్‌ను తొలగిం చినా ఊరుకునేది లేదని, తనను దెబ్బతీయాలని చూస్తే దేశవ్యాప్తంగా బీ జేపీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. బెంగాల్‌తో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళలోనూ ‘సర్’ ప్రక్రియ ప్రకంపనలు సృష్టిస్తున్నది.
బెంగాల్ సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశా యి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నందున దానిని నిలుపదల చేయలేమని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అయితే ఈసీ ఏ పని చేసినా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే మిన హా మిగతా అన్ని పార్టీలు ‘సర్’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
బ్యాలెట్ బాక్స్‌లతో ఉన్న ఓటింగ్ విధానం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతికి మారాక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నడుస్తుందని ప్రశంసలు కురిపించిన పార్టీలే ఇప్పుడు ఆ విధానం వల్ల నష్టం వాటిల్లుతోందని వాపోతున్నాయి. బీహార్‌లో ‘సర్’ కార్యక్రమం చేపట్టినప్పుడే ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈసీ మాత్రం తాను అనుకున్న లక్ష్యం మేరకే బీహార్‌లో ‘సర్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికలు కూడా సజావుగానే సాగాయి. బీహార్‌లో అధికారం లో ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు మళ్లీ పట్టం కట్టారు.
దీంతో రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ’పై గొంతు చించుకొని అరిచినా బీహారీ ఓటర్లు పట్టించుకోలేదు. అంతేకాదు ఈసీపై విపక్షాలు చేసిన అభ్యంతరాలు కూడా ఎవ రినీ కదిలించలేదన్నది వాస్తవం. కానీ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోరీ’పై భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో ‘సర్’ అమలు విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యాక్రమం చేపట్టాలని ఈసీ నిర్ణ యం తీసుకోవడం మంచి పరిణామమే.
‘సర్’ ప్రక్రియ వల్ల బెంగాల్‌లోని ధులోరి, బిరాటి, న్యూటెన్ ఘసరి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బం గ్లాదేశ్ వాసులు ఓటర్ల జాబితా ఏరివేతలో సరైన పత్రాలు చూపలేకపోవడంతో వలసవాదులని తేలిపోయింది. దీంతో వీరంతా ప్రస్తుతం బంగ్లా దేశ్‌కు దారిపడుతున్నారు.
నిజానికి బంగ్లాదేశీ వాసులు దళారీల అండ చూసుకొని నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులతో బెంగాల్‌లోకి ప్రవేశించారు. ‘సర్’ ప్రక్రియలో ఇవన్నీ నకిలీవని తేలడంతో బంగ్లాదేశీయులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏదీ ఏమైనా ఈసీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ద్వారా దేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులను పట్టుకోవడం సులువుగా మారిందన్నది మాత్రం వాస్తవం.