calender_icon.png 8 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సిరా’ రుబాయిలు

05-01-2026 02:08:40 AM

కష్టాలు నాకేయని వగచేవు ఎందుకు?

పరులకే సుఖాలు అని తలచేవు ఎందుకు?

రేపటి నీ చరితకు అవేగా పునాదులు

విజయ సోపానాలని మరిచేవు ఎందుకు?

******

ప్రాణాలను బలిగొమ్మని చెప్పదు ఏ మతం

మానాలను హరించమని చెప్పదు ఏ మతం

నీ దేశ పౌరులంటే నీ తోబుట్టువులు

మానవత్వం మరువమని చెప్పదు ఏ మతం

******

వాగుల్లోని నీరంతా నదులలో కలుస్తుంది

నదుల్లోని నీరంతా సంద్రంలో కలుస్తుంది

బిందువు బిందువును ఒడిసిపడితే సింధువవుతుంది

నీరులేని నాగరికత చరిత్రలో కలుస్తుంది !

******

తూరుపునా కోరగుట్ట మా ఊరు బొగ్గుట్ట

ఉత్తరాన చెరువు కట్ట మా ఊరు బొగ్గుట్ట

బొగ్గుగనుల పుట్టినిల్లు మా ఊరు బొగ్గుట్ట

సింగరేణ్ణి కన్నతల్లి మా ఊరు బొగ్గుట్ట

******

ఫొటోల రూపకల్పనకు కృత్రిమ మేధ

పాటల స్వరకల్పనకూ కృత్రిమ మేధ

ఏఐతో సమాజానికి ముప్పేకదా

మనిషి హితానికి వాడుము కృత్రిమ మేధ