calender_icon.png 9 January, 2026 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు అద్దాలు

05-01-2026 02:07:42 AM

వీధిలోని అద్దం -ఇంటిలోని అద్దం 

రెండు అద్దాలూ

రెండు వేర్వేరు ప్రతిబింబాలను చూపిస్తున్నాయి

ఇంటి అద్దంలోని మనిషి

వీధి అద్దంలో మారిపోతున్నాడు !

వీధి అద్దం లోని మనిషి ఇంటి అద్దం లో తారుమారవుతున్నాడు !

పూర్తి విరుద్ధ రూపాలుగా అగుపిస్తున్నారు !

******

పింఛాల్లా మెరిసిపోయే

గుట్టలూ కొండలూ కూలిపోతూ

తలల్లేని మొండేల్లా మనుషులు !

తాడూ బొంగరం లేని

నగర నాగరికత

నరమేధ యాగాలకి ఆజ్యం పోస్తోంది !

******

రాజ్యం అర్థాన్ని

పత్రికా ప్రకటనల నిఘంటువుల్లో

వ్యాపారం అని లిఖిస్తున్నారు

సంక్షేమ చిరునామాకి విడాకులిస్తూ !

******

వర్గపోరు ప్రవచనాలు తప్ప

 వైరాగ్య పేజీలని అనువదించడం లేదు

నిసర్గ జీవన పునాదులు నిలబెట్టడం లేదు !

******

వరికోతలు కోయాల్సిన కాలంలో

ఉరికోతలు నడుస్తున్నాయి !

చేపలు ఊడ్చేసి చెరువులని ఎండగట్టినట్టు

ప్రాణాలని ఊదేస్తూ ప్రహారీ కాస్తున్నారు !

******

ధ్వజస్తంభం మీది జెండా

రచ్చబండ మీద ఎగరడం లేదు

నట్టింటికి నడచి రావడం లేదు !

******

ఇంటి అద్దమూ,

వీధి అద్దమూ

ఏకం కానప్పుడు

ఏ నదీ పరవళ్లు తొక్కదు

ఏ గదీ గాదెలతో నిండదు

ఏ మదీ రాగాలు పలకదు !