calender_icon.png 8 January, 2026 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిమొగ్గల మనసులు ‘పిట్టగూళ్లు’

05-01-2026 02:10:15 AM

‘బాల సాహిత్యం మూల ధ్యేయం పిల్లల్లో సత్ప్రవర్తన కలిగించడం. వారిని మాతృభూమిని ప్రేమించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం’ అని అంటాడు ఓ కవివరేణ్యుడు. రచయిత, కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి కథలు అచ్చం అలాగే ఉంటాయి. గతంలో ఈయన వెలువరించిన కథా సంపుటిలోని ‘దొంగ తెలివి’, ‘ఏది మంచిది’, ‘మాతృప్రేమ’, ‘పితృభక్తి’ వంటి కథలు పిల్లలకు ఎంతో చేరువయ్యాయి. మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్ వంటి మహనీయుల జీవితాల ఆధారంగా యాదగిరిరెడ్డి కథలు విద్యార్థుల్లో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయి.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన ఈ రచయిత నల్లగొండకు చెందిన కథకుల్లో అగ్రగణ్యుడు. కేవలం కథకుడిగానే కాకుండా ఆయనకు బాలసాహితీవేత్తగా గుర్తింపు ఉంది. ఆయన మూడున్నర దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సమాంతరంగా రచనా వ్యాసాంగాన్నీ కొనసాగిస్తూ వస్తున్నారు. బాల సాహిత్యంపై ఆయనకు అమితమైన మక్కువ.

గతంలో వీరు రాసిన ‘మట్టి కథలు’, ‘కొలిమి కథలు’, ‘బొడ్రాయి కథలు’ సంపుటాలు విశేష పాఠకాదరణ పొందాయి. ఈ కథలు ఎంతోమంది పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు దోహదం చేశాయి. వీరు తర్వాత ఆయన బెంగళూరు నుంచి వెలువడే ‘ప్రజామాత’ అనే వారపత్రికకు అనేక కథలు రాశారు. ‘గుజ్జనగూళ్లు’ అన్న శీర్షికలో ఆ కథలు ప్రచురితమయ్యేవి. గడిచిన ఐదేళ్ల కాలంలో అలా 30 కథలు అచ్చయ్యాయి.

అయితే.. దురదృష్టవశాత్తు ప్రచురితమైన కథలను యాదగిరిరెడ్డి భద్రపరచుకోలేకపోయారు. అలా మన తెలుగు సాహిత్యం ఎన్నో అమూల్యమైన కథలను కోల్పోయింది. తన వద్ద మిగిలి ఉన్న 18 కథలతో ఇప్పుడు ఈ ‘పిట్టగూళ్లు‘ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ రచయిత రచనా శైలి, శిల్పం విలక్షణంగా ఉంటూ, పిల్లల మనసులను హత్తుకునేలా ఉంటుంది. తాజా ‘పిట్టగూళ్లు’ కథలు కూడా అదే కోవలో సాగింది. ‘చీమలు నేర్పిన పాఠం’ అనే కథ.. చదువుపై శ్రద్ధ లేని గోపాలం అనే విద్యార్థిది. గోపాలం తన తల్లిదండ్రులకు ఎలాంటి సాయం చేయడు.

ఎప్పుడూ సోమరిగా ఉంటాడు. చీమల బారులను చూసి గోపాలం క్రమశిక్షణ అంటే ఎంటో నేర్చుకుంటాడు. కథను రచయిత పిల్లలకు అర్థమయ్యే సాధారణ శైలిలో సాగించారు. ‘మహాత్మా గాంధీ’ అనే కథలో దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన పోరాటం, త్యాగనిరతిని కథకుడు విశదీకరించాడు. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’, ‘ఏది మంచిది?’ అనే కథలు పిల్లల్లో నైతిక విలువుల పెంచేలా ఉంటాయి. ఈ కథలన్నీ ‘చందమామ’ కథల్లా హాయిగా, సులభ శైలిలో సాగుతాయి. అక్బర్ -బీర్బల్ మధ్య మధ్య సాగే సంభాషణలతో కూడిన ఓ కథ కూడా సంకలనంలో ఉంది. 

‘పండితుడు, కవి ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలి‘ అనే అంతరార్థాన్ని కథ ద్వారా రచయిత చక్కగా వివరించారు. ‘శాప నిమోచనం’ అనే కథ.. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, పాపాలకు శిక్ష ఎలా ఉంటుందో హెచ్చరించే కథ. అలా ఏడు పదుల వయసులోనూ రచయిత యాదగిరిరెడ్డి బాలసాహితీవేత్తలకు తమ భవిష్యత్ గమనంపై దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. నల్లగొండ సాహిత్య సభలకు విచ్చేసే యువ కవులను, రచయితలను ఆయనెంతో ప్రోత్సహిస్తారు. ఈ ‘పిట్టగూళ్లు’ పుస్తకాన్ని రచయిత తన మిత్రునికి అంకితమిచ్చారు. బాల సాహిత్యంలో చేరిన మరో ఒక కలికితురాయి ఈ ‘పిట్టగూళ్లు’ కథల సంకలనం. బాలబాలికలు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.