calender_icon.png 10 October, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరాజ్ కెరీర్ బెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్

09-10-2025 12:28:03 AM

- టాప్-10 చేరువలో హైదరాబాద్ పేసర్

- బ్యాటింగ్‌లో జడేజాకు కెరీర్ బెస్ట్

దుబాయ్, అక్టోబర్, : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ళు దూసుకెళుతున్నారు. బౌలింగ్ తో పాటు ఆల్ రౌండర్ విభాగాల్లో ఇప్పటికే అగ్రస్థానాల్లో కొనసాగుతున్న టీమిండియా ఆటగాళ్ళు విండీస్ తో తొలి టెస్టులో గెలుపు తర్వాత చాలా మంది ర్యాంకులు మెరుగయ్యాయి. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో మొత్తం 7 వికెట్లు పడగొట్టిన సిరాజ్ ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు ఎగబాకి  12వ స్థానానికి చేరుకున్నాడు.

సిరాజ్ టెస్ట్ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. అలాగే అతని కెరీర్ లో తొలిసారి అత్యుత్తమంగా 700 రేటింగ్ పాయింట్లను దాటాడు. విండీస్ తో జరిగే రెండో టెస్టులోనూ సిరాజ్ తన ఫామ్ కొనసాగిస్తే టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. అటు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా...టాప్ 10లో మరే భారత బౌలర్ కూ చోటు దక్కలేదు. అయితే విండీస్ తో తొలి టెస్టులో సత్తా చాటిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 7 స్థానాలు మెరుగుపరుచుకుని 21వ ర్యాంకులో నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా కెరీర్ బెస్ట్ సాధించాడు.

అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ బాదడంతో ఆరు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి దూసుకొచ్చాడు. అతని కెరీర్ లో బ్యాటింగ్ పరంగా ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఆల్ రౌండర్ విభాగంలో ఇప్పటికే జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో జైశ్వాల్(7), పంత్ (8) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్ మన్ గిల్ 13వ ర్యాంకులో ఉండగా..కేఎల్ రాహుల్ 35, విండీస్ పై సెంచరీ సాధించిన జురెల్ 20 స్థానాలు మెరుగై 65వ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే టీమ్ ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా..దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్ వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.