09-10-2025 12:26:07 AM
-సఫారీ మహిళలతో భారత్ పోరు
-హ్యాట్రిక్ విజయమే లక్ష్యం
-స్మృతి, హర్మన్ మెరుస్తారా ?
-బ్యాటింగ్‌కు అనుకూలంగా విశాఖ పిచ్
విశాఖపట్నం, అక్టోబర్ : మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. సొంతగడ్డపై టైటిల్ కల నెరవేర్చుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు వరుసగా రెండు విజయాలతో అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకను, తర్వాతి మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్ గురువారం సౌతాఫ్రికా మహిళల జట్టుతో తలపడుతుంది. విశాఖ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఎ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
ప్రస్తుత ఫామ్, గత రికార్డుల పరంగా భారత జట్టునే ఫేవరెట్ గా చెప్పొచ్చు. అయితే స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పూర్తి ఫామ్ అందుకోలేదు. శ్రీలంకపై స్మృతి 8, హర్మన్ 21 పరుగులే చేయగా.. పాకిస్తాన్ పై స్మృతి 23, మంధాన 19 రన్స్ చేశారు. సౌతాఫ్రికాపై వీరిద్దరూ తమస్థాయికి తగిన ప్రదర్శన చేస్తే భారత్ కు భారీస్కోర్ ఖాయం. టాపార్డర్ లో హర్లీన్ డియోల్ నిలకడగా రాణిస్తోంది. ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రిఛా ఘోష్ కూడా ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం.
అటు బౌలింగ్ లో క్రాంతి రాణా అదరగొడుతోంది. ఈ ఏడాదే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రాంతి గత రెండు మ్యాచ్ ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టింది. అలాగే స్నేహ రాణ, దీప్తి శర్మ కూడా తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. పాక్ పై విజయంలో ఈ ముగ్గురే కీలకపాత్ర పోషించారు. సీనియర్ బౌలర్ రేణుకతో పాటు ఏపీ అమ్మాయి శ్రీచరణి కూడా రిథ మ్ అందుకుంటే భారత్ కు మూ డో విజయం పెద్ద కష్టం కాదు. మరోవైపు ఆ డిన రెండు మ్యాచ్ లలో ఒక విజయం, ఒక పరాజయంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై కేవలం 69 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం చవిచూసిన తర్వాత న్యూజిలాండ్ పై అద్భుతంగా పుంజుకుంది.
బ్యాటింగ్ లో బ్రిట్స్, కెప్టెన్ వొల్వార్ట్ , మారిజ్జానె కాప్ కీలకం కానున్నారు. బౌలింగ్ లో కాప్, లాబా ఫామ్ లో ఉన్నారు. హెడ్ టూ హెడ్ రికార్డుల్లో సౌతాఫ్రికాపై భారత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 33 మ్యాచ్ లలో తలపడి తే భారత్ 20 మ్యాచ్ లలో గెలవగా.. సౌతాఫ్రికా 12 మ్యాచ్ లలో విజయం సాధించిం ది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న విశాఖ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. సహజంగానే విశాఖలో బ్యాటర్లు పండగ చేసుకుంటారు. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ కోసం కూడా పూర్తి ఫ్లాట్ వికెట్ నే రూ పొందించినట్టు తెలుస్తోంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపొచ్చు. కాగా ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. నిన్న వర్షం కారణంగా ఇరు జట్లు ప్రాక్టీస్ రద్దయింది.