సీఈఐఆర్‌తో సిరిసిల్లకు కీర్తి
మొబైల్ రికవరీలో రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానం :- ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, జూలై 13, (విజయ క్రాంతి): సీఈఐఆర్ సాంకేతికతను సమర్థంగా వినియోగించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 76.8 శాతం మొబైల్ రికవరీ రేటు సాధించి రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సెల్ఫోన్ రికవరీ మేళాలో రూ.13 లక్షల విలువైన 90 పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సెకండ్హ్యాండ్ మొబైళ్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. దొంగిలించిన మొబైళ్ల కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైళ్ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ను ఎస్పీ అభినందించారు.






