28 March, 2026 | 3:01 AM

కాళేశ్వరంలో వైభవంగా సీతారాముల కల్యాణం

28-03-2026 12:31 AM

కాళేశ్వరం, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఉదయం 11 గంటలకు అబ్ జిత్ లగ్న ముహూర్తంలో శ్రీ సీతారాముల కల్యాణం అర్చకులు రామాచార్యులు, భాస్కర చార్యులు, నగేష్ శర్మ లా చే అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవం జరిగింది.  ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్, ప్రజాప్రతినిధులు, దాతలు, గ్రామస్తులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తి వాతావరణంతో నిండిపోయింది.

మంగపేటలో..

మంగపేట, మార్చి 27 ( విజయక్రాంతి ) : శ్రీరామ నవమి సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాలలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మంగపేట మండలంలోని కమలాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, పాత ఊరులోని ( వేప చెట్టు దగ్గర ) శ్రీ సంజీవ అంజనేయ స్వామి ఆలయం, బోరు నర్సాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం, చెరుపల్లిలోని కోదండ రామాలయం, తిమ్మంపేటలోని రామాలయం, రాజుపేటలోని రామాలయం, జిల్లా సరిహద్దు గ్రామమైన అకినేపల్లి మల్లారం గ్రామంలోని రామాలయంలో జరిగిన రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

శ్రీరామ నవమిని పురష్కరించుకుని కమలాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యులు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ఈశ్వరానందశర్మ, ఆయా ఆలయాలలో ఆయా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ కాలము , ప్రబోధకి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ  శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.