23 August, 2026 | 10:40 PM

ఆరు కొత్త పాలసీలు

22-05-2024 01:36 AM

కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పథకాలు పూర్తికావాలి: సీఎం రేవంత్

ఎంఎస్‌ఎంఈ, ఎక్స్‌పోర్టు, న్యూ లైఫ్‌సైన్సెస్..

రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ

ఈ రంగాల్లో కొత్త విధానాల కోసం కసరత్తు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారుల వెల్లడి

ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌పై సీఎం సమీక్ష

హైదారాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఆరు నూతన పథకాలను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. మంగళవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పారిశ్రామిక రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌పై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, రూపొందించాల్సిన విధానాలపై కీలక సూచనలు చేశారు.

గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై సీఎం ఆరా తీశారు. పవర్‌లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కొత్త పథకాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ, ఎక్స్‌పోర్టు, న్యూ లైఫ్‌సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త పథకాలు సిద్ధం చేస్తున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పాలసీల రూపకల్పన పూర్తికావాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలని అన్నారు. పథకాల రూపకల్పన కోసం ప్రపంచంలోని మేటి పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.