పాశమైలారం పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి రసాయన కర్మాగారంలో(Reactor Explosion Pashamylaram) సోమవారం రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రియాక్టర్ పేలుడు తీవ్రతకు కార్మికులు 100 మీటర్లు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో 66 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలగా, రసాయన పరిశ్రమలోని మరో భవనానికి బీటలు వచ్చాయి. రసాయన పరిశ్రమ పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి.
ఘాటైన వాసనలతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో(Sigachi Chemical Industry) ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. 11 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయ చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, పోలీసులు పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సహాయ చర్యలను పర్యవేక్షించారు. రసాయన కంపెనీలో ఒడిశా, ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో విధులకు వెళ్లిన కార్మికులకు కుటుంబసభ్యులు ఫోన్స్ చేస్తున్నారు. కొందరు కార్మికుల ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన కాలుష్యం వారి ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భయపడి పోలీసులు వారిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






