25-05-2025 01:17:34 AM
-డెన్మార్క్ నుంచి హెలికాఫ్టర్ తెప్పించి మాగ్నటిక్ సర్వే
-కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలి
-కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమే కాళేశ్వరం
-ఘోష్ కమిటీ నివేదికను అనుసరించి చర్యలు
-మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నకిరేకల్/ హుజూర్‌నగర్, మే 24: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూలిపోయిన ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులను పునఃప్రారంభించి తమ హయాంలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
సొరంగం వెళ్తు న్న 44 కిలోమీటర్ల భూమిని ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే చేయించేందుకు డెన్మార్క్ నుంచి హెలికాప్టర్ తెప్పించి, లైడార్ సర్వే చేయించనున్నట్టు తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజ కవర్గంలోని అయిటిపాముల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన ఆయన హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని పలు అభివృద్ధి పనుల పురోగతిపై కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ వద్ద జరుగుతున్న టన్నెల్ పనులకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణ, గోదావరి నది జలాలలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం రైతాంగంతో తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా బచావత్ ట్రిబ్యూనల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా, అందులో మాకు 299 టీఎంసీలు చాలంటూ గత ప్రభుత్వం లేఖ రాసిచ్చిందన్నారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ కు 70 శాతం ఇవ్వాలంటూ ప్రజాప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. అయిటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసి, 8 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్ విషయంలో రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశానికి సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే గంధమల్ల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ సమస్య దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని, తగ్గించి పనులు ప్రారంభించేలా ఆదేశించినట్టు చెప్పారు. అలాగే బస్వాపూర్ ఇరిగేషన్ భూ సేకరణకు వచ్చే నెలలో అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
దిండి ఎత్తిపోతల పథకానికి రూ.1,800 కోట్లు మంజూరు చేసి, టెండర్లు పిలిచినట్టు చెప్పారు. దున్నపోతుల, గండిబో త్తలపాలెం తోపాటు, కృష్ణా నదిపై చేపట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్టు అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.
రూ.38 వేల కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.1.20 లక్షల కోట్లకు నిర్మాణ వ్యయాన్ని పెంచి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరో పించారు. కేవలం కాంగ్రెస్‌కు పేరు వస్తుందన్న దుర్బుద్ధితోనే అప్పటి బీఆర్‌ఎస్ పాలకులు తుమ్మడిహట్టిని పక్కనబెట్టి, మేడిగడ్డకు మార్చారన్నారు. రూ.38 వేల కోట్ల అంచనాతో డిజైన్ చేసిన తుమ్మడిహట్టిని పూర్తిచేస్తే కమీషన్లు రావనే మరో మూడు బరాజ్‌ల నిర్మాణాలకు పూనుకొని ఆరోపించారు. కాళేశ్వరం ఉదంతంపై జస్టిస్ ఘోష్ కమిటీ నిష్పక్షపాతంగా జరుపుతోందని, తుది నివేదికను అనుసరించి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.