20 May, 2026 | 5:01 PM

స్మార్ట్ సిటీ పనులను పూర్తిచేయాలి

19-06-2024 01:22 AM
  • జవాబుదారీతనంతో పనిచేయాలి
  • ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూన్ 18 (విజయక్రాంతి): కరీనగర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్భాకర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అవినీ తిరహిత పాలన అందించాలని సూచించారు. కొన్నిచోట్ల స్మార్ట్ సిటీ పనులపై అదనపు కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

నగర ంలోని డంపుయార్డుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శాశ్వత పరి ష్కారం చూపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరించాలని సూచించారు. సొంత జాగాలో అనుమతి లేకుండా భవన నిర్మానాలు చేపట్టిన వివరాలూ తీసుకోవాలని ఆదేశించారు.  టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల ప్రకారం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే అధికారులే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో సమస్యలు ఎప్పటిక ప్పుడు పరిష్కరించాలని అన్నారు. ప్రజాధనాన్ని వృథా చేయవద్దన్నారు.

ప్రతి పనిని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, ప్రజలకు ప్రయోజనం ఉండేలా చూడాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత క్రమపద్ధతిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విధుల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల న్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతంగా చేపట్టి, సత్వరంగా పూర్తి చేయాల ని ఆదేశించారు. వన్‌టౌన్ ఎదురుగా మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రతివారం కార్పొరేషన్‌లోని ప్రతి విభాగంపై సమీక్షలు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. 

మేయర్, డిప్యూటీ మేయర్ డుమ్మా

కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి నగర మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి డుమ్మా కొట్టారు. కేవలం నగరపాలక సంస్థ అధికారులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. నగర మేయర్ హాజరుకాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో అధికారులను మందలించినట్లు సమాచారం.