10-12-2025 05:07:06 PM
* చెక్ లిస్ట్ చూసుకోవాలి
* జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట (విజయక్రాంతి): గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, ఎన్నికల విధులు నిర్వహించి సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు. ముందుగా పాపన్నపేట మండలంలో లోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ని చెక్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు.
పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. మైక్రో అబ్సర్వర్ లతో మాట్లాడి పలు సూచనలు చేసారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.
పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు వచ్చిపోయేదారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా 16 గ్రామ పంచాయతీలు సర్పంచులు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు. 1402 వార్డులకు గాను, 332 ఏకగ్రీవం కాగా పాపన్నపేట మండలంలోని అరికెల గ్రామంలో రెండు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపారు. 1068 వార్డులకు గాను 2426 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారని తెలియజేశారు. ఆరు మండలాలకు గాను 1292 పోలింగ్ కేంద్రాలు, 1421 పిఓలు, 1529 ఓపిఓలు, 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత ఎన్నికల సిబ్బంది తదితరులున్నారు.