12-11-2025 12:49:32 AM
చొప్పదండి,నవంబర్11(విజయక్రాంతి): బాలికల్లో ధైర్యం, భరోసా నింపేందుకే స్నేహిత కార్యక్రమం, మహిళలకు ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం గంగాధర మండలం గర్షకుర్తి ప్రభుత్వ పాఠశాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్నేహిత-2 అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభింరు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఫిర్యాదుల పెట్టె తాళం చెవి నోడల్ ఆఫీసర్, షీ టీం సిబ్బంది వద్ద ఉంటుందని.. విద్యార్థినులు తమకు జరిగిన ఇబ్బందులను పేపర్ పై రాసి ఇందులో వేస్తే అధికారులే విచారించి కారకులపై చర్యలు తీసుకుంటారని వివరించారు. ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100కు సమాచారం ఇవ్వాలని బాలికలకు సూచించారు. పోక్సో చట్టం గురించి వివరించారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని.. వారితో స్నేహంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, హె ఎం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.