11 June, 2026 | 2:27 AM

అక్రమం ఆగదు.. అనుమతి ఉండదు

11-06-2026 01:25 AM

ఖానాపూర్లో పాలమూరు రంగారెడ్డి డ్యాంలో మట్టి తవ్వకం

మట్టి తరలింపుకు అనుమతి లేదు  : నర్సింగ్ రావు తాసిల్దార్, జడ్చర్ల

జడ్చర్ల, జూన్ 10: అక్రమంగా మట్టి ఇసుక తరలింపు ఆగనే ఆగవు. ఇది సర్వసాధారణం అయిపోతుంది. అనుమతి లేదని అధికారులు చెబుతున్న అనుమతి ఎవరికి అనే విధంగా మట్టి వ్యాపారాలు వారి వ్యాపారని వారు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు అనుమతి లేదని చెబుతూ కార్యాలయాలకు పరిమితం కావడంతో ఇదే అదునుగా చూసుకున్న మట్టి వ్యాపారులు ఇష్టనుసారంగా ప్రాజెక్టులో మట్టిని తవ్వకాలు చేపడుతూ మూడు పూవులు ఆరు కాయలమైన వారి వ్యాపారాన్ని విస్తరింప చేసుకుంటున్నారు.

రాత్రి 10 గంటలు దాటితే జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డ్యాం,కాలువ కట్టల నుండి కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్న ఘటన కలకలం రేపుతోంది.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుండే మట్టిని తరలించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మట్టితో ఇసుక తయారీ..

గత కొన్ని రోజులుగా ప్రతి రాత్రి జేసీబీలు, టిప్పర్లు డ్యాం పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఎవరూ లేని సమయం చూసి కట్ట ప్రాంతంలో మట్టిని తవ్వేసి, టిప్పర్లలో నింపుకుని తరలిస్తున్నారు. ఈ మట్టిని ప్రైవేట్ వెంచర్లు, ఇళ్ల స్థలాల మేరకు కోసం అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ మట్టిని తీసుకెళ్లి నీళ్లతో కడిగి ఫిల్టర్ ఇసుకగా తయారుచేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 10 నుండి 20 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వాటిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.

‘ప్రాజెక్టు మా గ్రామం పక్కనే ఉంది. ఇది మా పొలాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. కానీ ఇలా కట్టనే తవ్వేస్తుంటే రేపు వర్షాకాలంలో డ్యాంకు ప్రమాదం కదా? కట్ట బలహీనపడి తెగిపోతే మా ఊరు మా పొలాలు మునిగిపోతాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు‘ అని ఖానాపూర్కు చెందిన సర్పంచ్ సర్వోత్తమ్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల డ్యాం కట్ట బలహీనపడటంతో పాటు, లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

అనుమతి లేదు..

నర్సింగ్ రావు, జడ్చర్ల తహసీల్దార్ ప్రస్తుతం మండలంలో ఎవరికి కూడా మట్టి తరలింపుకు ఎటువంటి అనుమతి లేదు. ఎవరు కూడా అలా మట్టితో పాటు ఇసుకను తయారీ మట్టి తరలింపు ప్రక్రియకు పాల్పడకూడదు. ప్రత్యేక చర్యలు తీసుకుని తనిఖీలు చేపడతాం. అలా తరలింపులకు పారిపోతున్న వారిపై చర్యలు తీసుకొని చట్టపరంగా ముందుకు సాగుతాం 

- నర్సింగ్ రావు, జడ్చర్ల తహసీల్దార్