పెద్ద చెరువు సమస్యను పరిష్కరించండి
మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ముంపు కాలనీల బాధితులు
సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి
పటాన్‌చెరు, మే 21 (విజయక్రాంతి) : అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు కాలనీల సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులు కలిశారు. మంత్రిని హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసి అమీన్‌పూర్ పెద్ద చెరువు నీటిలో కాలనీ మునిగిపోతున్న తీరు వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. వర్షాకాలంలో చెరువులోకి వస్తున్నా నీటిని తూము, అలుగుల ద్వారా నీటిని కిందికి వదలకపోవడంతో ఎఫ్‌టీఎల్ పెరిగి కాలనీలోకి నీళ్లు వచ్చి ప్లాట్లు మునిగిపోతున్నాయని మంత్రికి తెలిపారు.
స్పందించిన మంత్రి మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిషోర్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అమీన్‌పూర్ మున్సిపాలిటీ కమిషనర్ సుజాతతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో బ్రహ్మానందం, సత్యం, విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పూర్ణచందర్‌రావు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.






