పాటకు ఎంతో ప్రాధాన్యత బహుజనుల బతుకులను మార్చే శక్తి పాటకు ఉంది
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): ప్రపంచ ఉద్యమాలు, పోరాటాల్లో పాటకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బహుజన కళాకారుల సమ్మేళనం ఘనంగా జరిగింది. కవి, కళాకారుడు కుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి కవులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నక్సలైట్ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది బహుజన కళాకారులేనని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం కోసం కళాకారులు తమ కలాలు, గళాలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఊరూరా తిరుగుతూ బహుజనులను చైతన్యం చేయాల్సిన బాధ్యత కళాకారులపై ఉందన్నారు. ‘నక్సలైట్, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసిన బహుజన కళాకారులు.. ఇప్పుడు బహుజన రాజ్యాధికారం కోసం తమ కలాలు, గళాలను ఝుళిపించాలని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న కవులు మచ్చ దేవేందర్, గజ్జల అశోక్, గుడిపల్లి శ్రీకాంత్ తదితరులు మాట్లాడుతూ.. బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, తమ కలాలు, గళాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మేందర్, పృథ్వీరాజ్, రవీందర్ నాయక్, కార్యదర్శులు అనితా రెడ్డి, లింగంపల్లి యాదగిరిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.






