40 ఏళ్లుగా ఏకగ్రీవమే!
- ఈసారి ఎస్టీ రిజర్వేషన్
- చరిత్ర పునరావృతం అవుతుందా? లేక ఎన్నికలా?
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే స్వగ్రామం పోచారంలో ఏమి జరుగునో!
కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో పోచారం గ్రామపంచాయతీగా ఏర్పడిన నుంచి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటివరకు జరిగిన అన్ని పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఆ గ్రామానికి ఏ రిజర్వేషన్ వచ్చినా ఏకగ్రీవంగానే పాలకవర్గాన్ని ఎన్నుకుంటూ వచ్చారు.
ఈసారి మూడవ విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగనుండగా.. ఎస్టీ సర్పంచుగా రిజర్వేషన్ ఖరారైంది. బాన్సువాడ ఎమ్మెల్యే పరిగి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమే ఈ పోచారం. తన గ్రామం పేరే ఇంటిపేరుగా పొంది, పోచారం శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తింపు పొందారు. అయితే ఈ గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు జరగడానికి ఆయన కృషి చేస్తూ వస్తున్నారు.
ఈసారి కూడా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగానే ఎన్నుకునేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేస్తున్నారు. గ్రామస్థులు పోచారం మాటకు కట్టుబడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా లేదంటే ఎన్నికలకు వెళ్తారా వేచి చూడాల్సిందే.




