21-05-2025 01:15:46 AM
న్యూఢిల్లీ, మే 20: మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి మే 27 నాటికి కేరళను రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ సంస్థ అంచనా వేసినప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో అత్యంత త్వరగా కేరళను తాకే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ తెలిపింది.
2009 సంవత్సరం తర్వాత అతి త్వరగా కేరళను నైరుతి పలకరించడం ఇదే తొలిసారి. ఆ ఏడాది మే 23వ తేదీన కేరళను నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. వాస్తవానికి రుతుపవనాలు ఈనెల 22న అండమాన్‌ను, 26న శ్రీలంకను తాకొచ్చని అంచనా వేయగా.. పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్ లో విస్తరించాయి. నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయి.
ప్రతీ యేటా జూన్ 1న కేరళలోకి నైరుతి పవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశ మంతా విస్తరించుకుంటూ వెళ్తాయి. జూలై 8 నాటికి దేశమంతా విస్తరించి వర్షాలు కురుస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. గతేడాది మే 30న, 2023 లో జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి.
ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈసారి ఎల్‌నినో పరిస్థితులు లేవని కూడా తెలిపింది. భారత దేశ వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు చాలా కీలకమైనవి.
ఇవి దాదాపు 42.3శాతం జనాభా జీవనోపాధికి దోహదపడుతున్నాయి. దేశ జీడీపీకి 18.2శాతం తోడ్పాటు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తాగు,సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి జలాశయాలను నింపడానికి నైరుతి రుతుపవనాలే ప్రధానం.