calender_icon.png 13 May, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగీత, సాహిత్య సార్వభౌమ!

11-05-2025 12:00:00 AM

నేడు సామల సదాశివ జయంతి :

డా. నామోజు బాలాచారి

ఆదిలాబాద్ పేరు వినగానే గుర్తొచ్చే పేరు, సాహితీ దిగ్గజం సామల సదాశివ మాస్టారు. ఏడు భాషల్లో నిష్ణాతుడు. జీవితాంతం నిరాడంబరంగా జీవించారు. ఆయన రాసిన ముచ్చట్లు తెలుగు, ఉర్దూ సాహిత్య గుబాళింపులు. ఇవాళ మాస్టారు జయంతి వేళ ఆయన గురించిన నాలుగు ముచ్చట్లు. సదాశివ మాస్టారు మనమధ్య లేరన్నది నిజమే, కాని ఆయన జ్ఙాపకాలు ఎల్లప్పుడూ వెం టనే ఉంటాయి. చిరునవ్వుతో కూడిన ఆయన ముఖాన్ని మరిచిందెప్పుడు! ఒక సాహిత్యోద్యమంలా జీవించిన మహానుభావుడాయన.

సరళంగా, సుందరంగా, స్పష్టంగా, సహజంగా తెలు గు వాక్యం ఎలా రాయాలో నేర్చుకోవాలంటే సదాశివ వారి రచనలు చదవాల్సిం దే. ఆయన రాసిన మాటలు చదువుతుంటే ఇప్పటికీ ఎదురుగా కూర్చుని సంభాషిస్తున్నట్లే ఉం టుంది. హిందూస్థానీ సంగీతాన్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన మలయమారుతం ఆయన. కేంద్రసాహిత్య అకా డమీ పురస్కార గ్రహీత. 

సదాశివ 1928 మే 11న ఆదిలాబాద్‌జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు నాగ య్య-చిన్నమ్మలు. చదువుకుంది కాగజ్‌నగర్, వరంగల్‌లలో. ఎం.ఏ, బీఎడ్, డీలిట్ చేశారు. 1954లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆసిఫాబాద్ వాంకెడ, సిర్పూర్‌లలో పనిచేసిన తర్వాత భద్రాచలంలో ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఆయన ఒక కవి, రచయి త, అనువాదకుడు, చిత్ర లేఖకుడు, హిం దూస్థానీ సంగీత విద్వాంసుడు. ఇలా బహుముఖీన ప్రతిభావంతులు చాలా అరుదు.

సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఫార్శి, ఉర్దూ, మరాఠి భాషలు ఆయనకు కొట్టిన పిండి. ఈ విద్వత్తు వెనుక కుటుంబ నేపథ్యం ఉంది. తండ్రి తాతలు, మేనమామలు విద్యావంతులవ్వడం, ఇంట్లో అం దుబాటులో అనేక గ్రంథాలు ఉండడం వల్ల బాల్యం నుంచే సాహిత్యం పట్ల అనురక్తి ఏర్పడింది. 21వ ఏటనే ‘ప్రభాతం’ పేర్న లఘుకావ్య సంపుటి ప్రచురించినట్లు తెలుస్తోంది. 

ఉర్దూ మీడియంలో చదివి..

ఆయన చదువు అప్పట్లో ఉర్దూ మీడియంలో సాగింది. అందువల్ల సహజం గానే ఆ భాషపై పట్టు వచ్చింది. ఆయనకు ఒక ఉపాధ్యాయుడు పారసీ పండితుడు. సదాశివ ఆయనవద్ద పారసీ భాషకూడా నేర్చుకున్నారు. రియాజుహ్మ్రాన్ అనే ఆ పారసీ పండితుడు సదాశివ మాస్టారిపట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపించే వార ని తెలుస్తోంది. అలా నేర్చుకున్న పారసీ తర్వాత రూమీ సాహిత్యాన్ని అనువదించడానికి ఉపయోగపడింది.

ఉర్దూభా షపై ఆయనకు ఉన్న పట్టు తెలిసిన సురవరం ప్రతాపరెడ్డి ఉర్దూ సాహిత్యాన్ని తెలు గువారికి పరిచయం చేయాలని చెప్పారు. అలా ఆయన ఉర్దూ సాహిత్యం గురించి ఒక పుస్తకం రాశారు. అలాగే, సంగీత శాస్త్ర పరిజ్ఙానాన్ని ఫణికుమార్ నుంచి గ్రహించడమే కాదు, హిందూస్థానీ సంగీతమ ర్మాలను లోతుగా ఆకళింపు చేసుకుని ‘మలయమారుతాలు’ రచించారు.

‘ఆంధ్ర ప్రభ’ వారపత్రికలో ఇవి వ్యాసాలుగా ఇవి ప్రచురితమైనాయి. ‘శ్రీకర కరుణా ప్రపూర్ణ శ్రీ సాంబశివ’ అనే మకుటంతో ‘సాంబశివ శతకాన్ని’ 50వ దశకంలోనే రాశారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి దీనికి ముందుమాట రాశారు. తర్వాత ‘నిరీక్షణం’, ‘మంచి మాటలు’ పేర్న పద్య సంకలనాలు ప్రచురించారు. ‘సాఖీనామా’ పేరుతో ఉర్దూ సాహిత్య పత్రికలను పరిచయం చేశారు. ఆయన రాసిన పద్య సాహిత్యం అప్పట్లో ‘భారతి’ పత్రికలో ప్రచురితమైంది. 

ముచ్చట్ల వలె రచనలు..

సదాశివ మాస్టారుకు ఉర్దూ, తెలుగు భాషల్లో సమాన ప్రావీణ్యం ఉండేది. కాళో జీ నారాయణరావు సోదరుడు కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ అనే కలం పేరుతో రాసేవారు. ఆయనను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసింది సదాశివ మాస్టారే. ‘సియాసత్’ పత్రికలో ఆయన రాసిన ఉర్దూ వ్యాసాలు వచ్చేవి. సదాశివ వారి పేరు వినగానే మనకు సాహిత్యమే కాదు సంగీతమూ తప్పక గుర్తుకు వస్తుం ది. సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలూ గుర్తుకు వస్తాయి. మీర్జా గాలిబ్‌ను ఆయన తెలుగువారికి అద్వితీయమైన రీతిలో పరిచయం చేశారు.

అమ్జ ద్ రుబాయిలను తెలుగు వారికి అందించారు. ఆయన రచనల్లో ప్రత్యేకత ఏమిటం టే, స్వయంగా మహాపండితుడైనప్పటికీ భాష సగటు తెలంగాణ స్థాయిలోనే వాడేవారు. మనతో ముచ్చట్లు చెబుతున్నట్లుగా నే రచనలు ఉంటాయి. బహుశా ఇలాంటి శైలి ఆ తర్వాత మరెవ్వరు పట్టుకోలేక పోయారు. ప్రతి రచనలోను అనేక కొత్త విషయాలు మనసుకు హత్తుకునేలా చెప్పారు. తన మాటలు మృదుమధురం, రాతలు సున్నితం, భాష సహజ సుందరం. 

హిరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియాఖాన్, బేగం అక్తర్, గం గూబాయి హంగల్, కేసర్ బాయ్... ఇలా అనేకమంది సంగీత విద్వాంసుల ఆలపనా విధానాలను ఆయన అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా వివరించారు. అప్పటి అనేక సంఘటనలను ప్రస్తావిస్తూ ముచ్చట్ల మాదిరిగా చెప్పడం ఆయన విశిష్టత. ఉర్దూ భాష మాధుర్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయడమే కాదు, తెలుగు సొగసులను ఉర్దూ వారికీ అందించారు. చిన్నా పెద్దా అందరి పట్ల సన్నిహిత ప్రేమాభిమానాలు కురిపించేవారు. 

అందరి వాడు!

కేవలం సంగీత సాహిత్యాలకే ఆయన పరిమితం కాలేదు. చిత్రలేఖనంలోను అభినివేశం ఉన్నవారు. నకాషీ చిత్రాలను చూసి తానుకూడా అలా వేయాలనుకుని చిత్రలేఖనం నేర్చుకున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ టీచర్స్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్నప్పుడు అక్కడ సరోజినీ నాయుడు మేనల్లుడు దీన్ దయాల్ నాయుడు క్రాఫ్ట్ టీచరుగా ఉండేవారు.

ఆయనవద్ద శిష్యరికం చేసి చిత్రలేఖనం నేర్చుకున్నారు. తన కవితలకు తానే బొమ్మలు గీసుకునే వారు. సామల సదాశివ మాస్టారు గురించి చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం అన్ని వర్గాలు, వాదాలు, ప్రాంతాల వారితోనూ సత్సంబంధాలు కలిగి ఉండేవారు. రచన ఆయన ప్రవృత్తి. సాహిత్యం ఆయన స్వభా వం. సంగీతం ఆయన ప్రాణం. ఆయన ఏనాడు అవార్డులకు ఆశ పడలేదు. 

అవార్డులే ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి. దాదాపు 60 సంవత్సరాలు తన సాహిత్య ప్రస్థానాన్ని నిశ్శబ్దంగా, నిర్విరామంగా కొనసాగించారు. తెలంగాణ ఆత్మాభిమా నం ఆయనలో తొణికి సలాడేది. స్వయంకృషి తన మాటల్లో ధ్వనిం చేది. సృజనాత్మకత వారి స్వభావం. తెలంగాణ వైతాళికుడిగా ఆయన పేరు చరిత్ర పుటల్లో చెరగనిది. డాక్టర్ సామల సదాశివ 2012 ఆగ స్టు 7న ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా గొప్పనైన ఆయన జ్ఞాపకాలు సాహితీప్రియుల మనసుల్లో కలకాలం గూడు కట్టుకొనే ఉంటాయి.

- వ్యాసకర్త తెలంగాణ 

సాహిత్య అకాడమీ, కార్యదర్శి

సెల్: 9063131999