11-05-2025 12:00:00 AM
నేడు మాతృ దినోత్సవం :
పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలోనే మొదలైంది మన ఈ జన్మ. కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, తన జీవితాన్ని త్యాగం చేసి అందరినీ కనుపాపలా చూస్తూ, ఆత్మీయత పంచుతూ, వారి ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేస్తూ, వారి భవిష్యత్తుకై ఇంటిని నందనవనం చేసే అమ్మలకు పాదాభివందనం. సృష్టికి మూలం అమ్మ. శిశువు అయినా, పశువు అయినా అమ్మ ఒడికే పరుగులు తీస్తుంది. అమ్మే లేకపోతే ఈ సృష్టి లేదు.
కనిపించని దేవుళ్ళకన్నా మనల్ని కని పెంచిన అమ్మే మనకు ప్రత్యక్షదేవం. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. బిడ్డ సమగ్రాభివృద్ధిలో ఆమెనే కీలకం. అమ్మ అనే పదంలోనే ఆత్మీయత, అనురాగం, ప్రేమ, త్యాగం, నిస్వార్థం అన్నీ ఇమిడి ఉన్నాయి. ‘ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే’ అన్నట్టు వారి అభివృద్ధికోసం నిష్కల్మషంగా ప్రేమించేది అమ్మే. ‘తల్లి కడుపు చూస్తుంది, ప్రియురాలు జేబు చూస్తుంది’ అన్నది జీవిత సత్యం. తాను పస్తు వుండైనా తన బిడ్డ కడుపు నింపే కల్మ షం లేని మనసు ఆమెది.
మన తల్లులను జాగ్రత్తగా చూసుకోవడం, వారిని గౌరవించడం, ప్రేమించడం పిల్లలు గా మన బాధ్య త. మదర్స్ డేని ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం తల్లులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, ఆమెపై ప్రేమను కురి పించడానికి జరుపుకుంటారు. అమెరికాలో 1907 మే 12న అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లికోసం స్మారక సేవను నిర్వహించినప్పుడు ఈ ప్రత్యేక దినోత్సవం ఆలోచన మొదలైంది. అప్పటినుం చీ ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో ‘మాతృ దినోత్సవం’ జరుపుకుంటున్నారు.
1914 నుంచి అమెరికాలో జాతీయ సెలవు దినంగా మదర్స్ డేను ప్రకటించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి ఆలనాపాలన చూసే బాధ్యత వారి పిల్లల దే. దురదృష్టవశాత్తు వృద్ధాశ్రమాలలో వారిని ఉంచి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న వారెందరో. సోషల్ మీడియా మాయలో పడి వారికి చాలామంది దూరమవుతున్నారు.
తల్లిదండ్రులతో ఏదో ఒక సమయంలో తప్పకుండా మనసు విప్పి మాట్లాడుతామని మదర్స్ డే సందర్భంగా అందరూ ప్రతిన పూనాలి. పండు గల వేళ పిల్లలు తమతో గడపాలని ప్రతీ తల్లీ కోరుకుంటారు. జీవితంలో మనం సాధించిన ప్రతీ విజయంలో అంతర్లీ నంగా ఉండేది అమ్మే అని గుర్తుంచుకొందాం.
పాకాల శంకర్‌గౌడ్