13-05-2025 11:16:27 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైన భారత్ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వివిధ దేశాల రాయబారులతో ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ముఖ్య వివరాలను కేంద్రం పంచుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద నిర్మూలనలో వేసిన ముందడుగు వివరాలను తెలియజేసి పహల్గామ్ దాడి తర్వాత పాక్ వ్యవహరించిన తీరును ఎండగట్టి దేశాల మద్దతును భారత్ కోరనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పలుదేశాల ప్రతినిధులతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, పలువురు ఉన్నతాధికారులు, రక్షణ శాఖ అధికారులు భేటీకానున్నలు తెలుస్తోంది.