స్పెయిన్ మరొక్క అడుగే

11-07-2024 12:10:00 AM

 సెమీస్‌లో ఫ్రాన్స్‌పై విజయం

యూరోకప్ సాధించాలన్న ఫ్రాన్స్ కల చెదిరింది. టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన స్పెయిన్ నాకౌట్ పోరులోనే అదే జోరు ప్రదర్శిస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్ నెగ్గిన స్పెయిన్ నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.

మునిచ్: ప్రతిష్ఠాత్మక యూరోకప్‌లో స్పెయిన్ తుదిపోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2 ఫ్రాన్స్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. స్పెయిన్ తరపున లామినే యమల్ (ఆట 21వ నిమిషం), డాని ఒల్మో (25వ ని.లో) గోల్స్ సాధించగా.. రాండల్ కోలో మువాని (9వ ని.లో) ఫ్రాన్స్ తరఫున ఏకైక గోల్ చేశాడు. సోమవారం అర్థరాత్రి జరగనున్న ఫైనల్లో నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మధ్య విజేతతో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ మొదలైన కాసేపటికే రాండల్ ఫ్రాన్స్‌కు గోల్ అందించాడు. అయితే గోల్ కొట్టామన్న సంతోషం ఫ్రాన్స్‌కు ఎక్కువసేపు నిలవలేదు. నాలుగు నిమిషాల వ్యవధిలో స్పెయిన్ రెండు గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్థభాగంలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. నిర్ణీత సమయంలోగా ఆధిక్యంలో నిలిచిన స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. మ్యాచ్‌లో స్పెయిన్ తరఫున గోల్‌తో మెరిసిన 16 ఏళ్ల లామినే యమాల్ యురోకప్‌లో గోల్ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.