calender_icon.png 9 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నరేగా’పైనమో కుట్ర!

09-01-2026 01:09:11 AM

  1. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరు
  2. నిబంధనల ముసుగులో ‘నరేగా’ శాశ్వత సమాధికి యత్నం
  3. ఉపాధి హామీ రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరుగుతాయి
  4. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా) పేరు మార్పు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనల ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు  క్షేత్ర స్థాయిలో పోరాటానికి  సిద్ధ్దంగా ఉండాలన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో 80 శాతం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులని, పేదలపై కక్ష పెట్టుకుని ఈ పథకాన్నే మారుస్తారా..? అని సీఎం ప్రశ్నించారు.

మెజారిటీ ఉందని, చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తా మంటే కుదరదని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన  గురువా రం గాంధీభవన్‌లో పీఏసీ విస్తృత సమావేశ జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, డీసీ సీ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హమీ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ  పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినదన్నారు. వెట్టి చాకిరిని నిర్మూలించి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, ఓటు హక్కు ఇచ్చింది మహాత్మా గాంధీ, అంబేద్కర్ అని ఆయన తెలిపారు. 

పేదల ఆర్థిక భద్రత.. 

 ఉపాధి హామీ పథకాన్ని మొదట అమలు చేసింది తెలుగు రాష్ట్రాలేనని సీఎం తెలిపారు. ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గాయని, ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరుగుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరిగితే కార్పొరేట్ కంపెనీలకు చవకగా కార్మికులు దొరుకుతారని వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

పేదలకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే ఒప్పుకోమని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. ఒకప్పుడు దొరల దగ్గర పేదలు వెట్టిచాకిరి చేస్తూ బతికేవారని, దేశ ప్రజలకు విముక్తి, స్వతంత్రాన్ని ఇచ్చి ఓటు హక్కును కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.

గతంలో వ్యవసాయంపై కుట్ర చేశారని, రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలు తయారుచేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పోరాటం వల్ల నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు పేదలను బానిసలుగా మార్చేందుకు నూతన చట్టం చేస్తున్నారని, పేదలకు వ్యతిరేకంగా వీబీజీ రామ్‌జీ చట్టం తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.

జీ రామ్ జీ చట్టం రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని, ఈ చట్టాలన్ని అసెంబ్లీ తిరస్కరించిందన్నారు. అసెంబ్లీ తిరస్కరంచడంతో.. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. 

ఎస్‌ఐఆర్ వెనక పెద్ద కుట్ర ఉంది.. 

దేశంలో బ్రిటిష్ పాలన తరహాలో మోదీ పాలన ఉందని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. 2024 ఎన్నికల్లో తమకు 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారని సీఎం గుర్తు చేశారు. బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదల హక్కులు కాలరాయాలని చూశారని, కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రజలను కాంగ్రెస్ అప్రమత్తం చేయడం వల్ల బీజేపీకి సీట్లు తగ్గాయని, బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయిందని తెలిపారు.

400 సీట్లు రాకపోవడం వల్ల రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడిందని, రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు కానీ వేరే రూపంలో హక్కులు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఓటు హక్కు పోతే ఆధార్‌కార్డు,  సంక్షమ పథకాలు పోతాయయని, అందుకు  ఎస్‌ఐఆర్ వెనక పెద్ద కుట్ర ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పారు. అదానీ, అంబానీకి దేశాన్ని అప్పగించే కుట్ర అమలుకాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. 

9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు

జీ రామ్ జీపై నిరసన

  1. ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం 
  2. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. 
  3. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా) పథకం ఎత్తివేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రను గల్లీ వరకు తీసుకెళ్లాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఒకవైపు గ్రామ సభల్లో తీర్మానం చేస్తూనే.. పార్టీ పరంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు తెలంగాణలో.. హైదరాబాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి  జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

౩న మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి సభ నిర్వహించినున్నట్టు తెలిపారు. ఈ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూస్తారని, వీటిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పర్యవేక్షిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులు బాధ్య త తీసుకోవాలన్నారు.

ప్రతి మండలానికి ఒక ఇంచార్జిని నియమించాలని, తను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం స్పష్టంచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగులో ఏర్పాటుచేసే సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. ఈ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలు తిప్పికొట్టాలని, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధ్ది పనులను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు.

ఆయా జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న పనులను, ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇవ్వాలన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చి న జీరామ్‌జీ చట్టం పేరులోనే గందరగోళం ఉందన్నారు. దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుంది? దేశానికి ఈ విషయంలో మోదీ తో క్షమాపణలు చెప్పిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల మొదటిరోజు రాష్ర్ట ఎంపీలు నిరసన తెలపాలని సీఎం చెప్పారు. 

కాంగ్రెస్ జెండా ఎగరాలి.. 

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కర్యక ర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత  మా పైన ఉందన్నారు. కార్యకర్తల గెలుపు కోసం తాను గల్లీగల్లీ కాదు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచా రం చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను సీఎం అయ్యాను.. కాంగ్రెస్‌కు తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడింది. దేశం ఇబ్బందుల్లో ఉంది.. ఈ పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం తెలంగాణ అండగా ఉంటుంది’ అని అన్నారు.