calender_icon.png 9 January, 2026 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మిడ్ మానేరు’ అక్రమాలపై చర్యలేవీ?

09-01-2026 12:33:53 AM

  1. ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గురు ఇంజనీర్లను బాధ్యులుగా గుర్తించిన విజిలెన్స్
  2. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభా గం నిర్ధారించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న రెండు కాంట్రాక్టు సంస్థలు, అలాగే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ముగ్గురు ఇంజనీర్లను దీనికి బాధ్యులుగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం పంపించిన నివేది కలో స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం.

విజిలెన్స్ విభాగం  మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై చేసిన విచారణ నివేదిక కొద్దికాలం క్రితమే విజిలెన్స్ కమిషన్‌కు చేరింది. ఈ నివేదికలోనే అందులో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేశారు. ఇందులో రెండు కాంట్రా క్టు సంస్థలతోపాటు.. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీఈ, ఎస్‌ఈ, ఈఈలు దీనికి బాధ్యులుగా గుర్తించి, వారిపై చర్యలకు సిఫారసు చేశారు. ఇప్పుడు వారిపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అక్రమాలు నిజమే..

మిడ్‌మానేరు నిర్మాణం ప్రారంభం నుం చే అక్రమాలు, అవకతవకలకు బీజం పడినట్టుగా విజిలెన్స్ విభాగం విచారణలో బయ టపడ్డట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థను పక్కనపెట్టి.. పూర్తి కాంట్రాక్టును రద్దుచేసి.. వేరే కాంట్రాక్టు సంస్థకు సగం పనిని అప్పగించడంలో భారీగా అవినీతి జరిగినట్టు, అందు లో కీలకమైన పాత్రను అప్పటి సీఈ, ఎస్ ఈ, ఈఈలు పోషించినట్టుగా విజిలెన్స్ వి భాగం గుర్తించినట్టు సమాచారం.

ఇలా కాంట్రాక్టు సంస్థను మార్చడానికి అప్పటి ప్రభు త్వ పెద్దల పేరును వాడుకున్నట్టుగాకూడా విజిలెన్స్ గుర్తించినట్టు తెలుస్తుంది. అంతే కా కుండా.. పనులు అప్పగించిన తరువాత.. రెండు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను సమాంతరంగా పర్యవేక్షించకుండా.. నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంజనీరింగు అధికారులు వ్యవహరించడంతోనే అప్పట్లో మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయినట్టుగా విజిలె న్స్ విచారణలో బయటపడినట్టు సమాచా రం.

వాస్తవానికి అప్పట్లో.. పై నుంచి భారీ వరద రావడంతో మిడ్‌మానేరు కొట్టుకుపోయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే రెం డు కాంట్రాక్టు సంస్థలు సమాంతరంగా పను లు చేయకపోవడం వల్ల, వీటిని ఇంజనీర్ అధికారులు సరిగా సమన్వయం చేయకుం డా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మిడ్‌మానేరు కొట్టుకుపోయినట్టుగా విజిలెన్స్ విచారణలో తేల్చినట్టుగా తెలుస్తుంది.

విచారణలో భాగంగా.. విజిలెన్స్ విభాగం అధికా రులు.. మిడ్‌మానేరు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియో లను పరిశీలించి, అప్పుడు వాడిన మెటీరియల్, మట్టి నమూనాలను కూడా సేకరించి నట్టుగా సమాచారం. అలాగే నిర్మాణంలో ఎక్కడెక్కడ  నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరించారు.. అందుకు బాధ్యు లు ఎవరు అనేది గుర్తించినట్టు తెలుస్తుంది.

సర్కారు చర్యలపై ఉత్కంఠ..

కీలకమైన మిడ్‌మానేరు అక్రమాలపై వి జిలెన్స్ చేసిన విచారణలో బయటపడ్డ వాస్తవాలు, గుర్తించిన అక్రమాలు, అందుకు బా ధ్యులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నీటిపారుదల శాఖలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కమిషన్ చెంతకు చేరి చాలా కాలం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతా లు రాకపోవడంతో.. నివేదికను, అందులో పేర్కొన్న అంశాలను సృశిస్తూ.. చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిఫారసు చేయాల్సి ఉంది.

సర్కారు నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగానే విజిలెన్స్ కమిషన్ ముందడుగేస్తుందని, అందుకు వేచి చూస్తున్నట్టుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి మిడ్‌మానేరుపై విజిలెన్స్ విచారణలో వెల్లడైన వాస్త వాలు, బాధ్యులపై చర్యలు తీసుకోవడం సర్కారు కనుసన్నల్లోనే ఉంది. 

రూ. 1000 కోట్ల అక్రమాలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దశాబ్దకాలం క్రితం మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, దీనివల్ల రూ. 1000 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొంటూ స్థానిక నాయకుడొకరు హైదరాబాద్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

దీనిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచా రణ చేయిస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని అందులో పేర్కొంటూ.. అవినీతి, అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన పలు అంశాలను అందులో పొందుపర్చారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జీ చిన్నారెడ్డి విచారణ చేయాలని సూచిస్తూ.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి పంపించారు. దీనితో విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేశారు.

సీఈ, ఎస్‌ఈ, ఈఈలే కీలకపాత్రధారులు..

మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న రెండు నిర్మాణ సంస్థలు (కాంట్రాక్టు సంస్థలు)తోపాటు.. నిర్మాణ సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీఈ, ఎస్‌ఈ, ఈఈలు దీనికి పూర్తిగా బాధ్యులని విజిలెన్స్ విచారణ సందర్బంగా వెల్లడైనట్టు తెలుస్తుంది. మిడ్‌మానేరు నిర్మాణ సమయంలో  సీఈగా అనిల్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఆయన ఈఎన్‌సీగా అయిన తరువాత.. మిడ్‌మానేరుపై ఫిర్యాదు అందింది.

ఈ నేపథ్యంలోనే మిడ్‌మానేరుపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సందర్భంలోనే విచారణకు ఆటంకం కలిగించేలా అప్పటి ఈఎన్‌సీ అనిల్‌కుమార్ పలు బదిలీలు చేశారు. దీనివల్ల తాను సీఈగా ఉన్న మిడ్ మానేరు విచారణ తనకు అనుకూలంగా జరిగేలా ప్రయత్నం చేశారనే ఆరోపణలుకూడా అప్పట్లో వచ్చాయి. దీనితో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, విజిలెన్స్ డీజీ లమధ్యన లేఖల యుద్ధం జరిగినట్టుగా నీటిపారుదల శాఖలోనూ చర్చజరిగింది.

తరువాత అనిల్‌కుమార్ ఈఎన్‌సీగా తప్పించి రిటైర్డ్ అయ్యేరోజు వేరేచోట పోస్టింగ్ ఇచ్చి.. మమ అనిపించారు. ఇక మిడ్‌మానేరు నిర్మాణ సమయంలో ఎస్‌ఈ, ఈఈలుగా పనిచేసిన ఇంజనీర్లుకూడా కొంత కాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ఈ ముగ్గురు ఇంజనీర్లే మిడ్‌మానేరు అక్రమాల వ్యవహారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారని విజిలెన్స్ విచారణలో గుర్తించినట్టు సమాచారం. అందుకే ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గురు ఇంజనీరింగు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ నివేదికలో సఫారసు చేసినట్టు తెలుస్తుంది.