09-01-2026 01:05:21 AM
మన సీఎంకు దేవాదుల ఏ బేసినో? బాక్రానంగల్ ఏ రాష్ట్రానిదో తెలియదు
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): నదులపై, జలవనరులపై అవగాహన లేని అజ్ఞాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బాక్రానంగల్ ప్రాజెక్టు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండగా, స్వాతం త్య్ర దినోత్సవ ప్రసంగంలో అది తెలంగాణలో ఉందని చెప్పిన రేవంత్‌రెడ్డి తమకు నీటి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో, ట్రిబ్యునల్స్ ఎందుకు పనిచేస్తా యో తెలియని నాయకుడికి.. కేసీఆర్‌కు పాఠాలు చెప్పే అర్హత లేదని స్పష్టంచేశారు.
గురువారం తెలంగాణ భవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గ నేతల చేరికల సమా వేశంలో కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు- ఎత్తిపోతల పథకం విష యంలో రేవంత్‌రెడ్డి అజ్ఞానం, రాజకీయ దురుద్దేశాన్ని ఎండగట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును కేవలం 10 శాతం పూర్తి చేయకుండా పాలమూరుపై రేవంత్‌రెడ్డి పగపట్టారని మండిపడ్డారు. నార్లాపూర్, కరివెన, వట్టెం, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్న ప్పటికీ కాల్వల పనుల కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, పునఃప్రారంభించకపోవడం వెనుక పాలమూరుకు నీళ్లు అందనీయకూడదన్న కుట్ర ఉన్నదని పేర్కొన్నారు.
త్వరగా పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతోనే రేవంత్‌రెడ్డి పని చేయడం లేదని, తన పాత బాస్‌కు కోపం వస్తుందని భయపడుతూ పాలమూరును ఎండబెట్టే చర్య లు చేస్తున్నారని వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు వద్ద నీళ్లు లేవని, నీళ్లు లేనికాడ మోటార్లు పెడతారా? అని ప్రశ్నించారు. దీం తోనే రేవంత్ అవగాహనలేమి బహిర్గతం అవుతున్నదన్నారు.
నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కేసీఆర్ స్వయంగా బటన్ నొక్కి 145 మెగావాట్ల పవర్ పంపును నడిపించి కృష్ణా నీటిని ఉప్పొంగించిన రోజును పాలమూరు ప్రజలు చూశారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం చెక్ డ్యాములు, మేడిగడ్డ బ్యారేజీలు వర కు కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నద ని, రైతన్నలను అష్టకష్టాల పాలు చేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహించారు. ఆరు గ్యారెంటీలు ఎగవేశారని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని, హైడ్రా వంటి అరాచక చర్యలతో ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో 11 సార్లు రైతుబంధు ఇచ్చామని, కాంగ్రెస్ రెండేళ్లలో ఒక్కసారే రైతు భరోసా ఇచ్చిందని చెప్పారు.
యూరియా కోసం రైతులు చెప్పులు లైన్‌లో పెట్టి యుద్ధా లు చేసే పరిస్థితి వచ్చిందని, షాపుల్లో యూరి యా లేనప్పుడు యాప్‌ల్లో ఇస్తామనే హాస్యాస్పదమైన వాదనతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. గ్యారెంటీ కార్డులు అమలు చేయకుండానే ఇప్పుడు కొత్తగా యూరియా కార్డు పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
మంత్రి పదవి కోసమే జూపల్లి అడ్డగోలు మాటలు
గత ఏడాది ఆదిలాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందో రాదో తనకు తెలీదు, తాను గెలుస్తానో లేదో కూడా తెలీదు అని చెప్పారని కేటీ ఆర్ గుర్తుచేశారు. కృష్ణారావుకు తెలియకపోవ చ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ కృష్ణారావును మళ్లీ కొల్లాపూర్ ప్రజలు గెలిపించబోరని పేర్కొన్నారు.
జూపల్లి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, నేడు మంత్రి పదవి కాపాడుకోవడమే లక్ష్యం గా రేవంత్‌రెడ్డిని సంతృప్తిపరచడానికి అడ్డగోలుగా మాట్లాడటం నిస్సహాయత, స్వార్థపూరి త అవకాశవాదమన్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి అరాచకాలను ఎదుర్కొంటూ బీఆర్‌ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలంగా గెలిచి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు ఏకమై పనిచేయాలని సూచించా రు. కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కొల్లాపూర్‌లో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి కోసం సంక్రాంతి తర్వాత పర్యటిస్తామన్నారు.