09-01-2026 12:53:20 AM
కోల్‌కతా, జనవరి 8 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణం.. తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహాలతో అండగా ఉన్న ఐప్యాక్ సంస్థపై ఈడీ సోదాల కలకలం. గురువారం ఒక్కసారిగా బెంగాల్ వేడెక్కింది. రాజకీయ కన్స ల్టెన్సీ గ్రూప్ ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్‌జైన్ నివాసంలో, ఆ సంస్థ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడు లు చేసింది. ఐప్యాక్‌కు బెంగాల్ బొగ్గు గనుల కుంభకోణం కేసుకు, మనీలాండరింగ్‌కు సంబంధం ఉన్నట్లు తేలడంతోనే దాడులు నిర్వహించామని ఈడీ తెలిపింది.
సోదాలు చేస్తున్న సమయంలోనే భారీ పోలీసు బందోబస్తుతో అక్కడికి వచ్చిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ఫైళ్లను తీసుకెళ్లారని, అధికారిక దర్యాప్తును అడ్డుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ తీవ్ర ఆరో పణలు చేసింది. అయితే ఈ దాడుల వెనుక కేంద్ర హోమంత్రి అమిత్ షా ఉన్నారని, తమ రాజకీయ డేటాను ఈడీ స్వాధీనం చేసుకుందని, తృణమూల్ ఎన్నికల వ్యూహాన్ని బీజేపీ చోరీచేసిందని మమత కూడా తీవ్ర ఆరో పణలు చేశారు. ఆమె పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారం రాజకీయ ఉద్రిక్తతలను పెంచడంతో, ఈడీ, మమత ఎన్నికల వ్యూహకర్త అయిన ఐ-ప్యాక్ రెండూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఐ-ప్యాక్‌కు సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ దాడులను నిర్వహించిం ది. సీఎం మమతా బెనర్జీ రానంత వరకూ కోల్‌కతాలోని ఐ-ప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ నివాసంలో, ఆ సంస్థ కార్యాలయంలో సో దాలు ప్రశాంతంగా జరిగాయని ఈడీ తెలిపింది. బెంగాల్ బొగ్గు గనుల కుంభకోణం కేసుతో ఈ దాడులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించే తనిఖీలు చేశామని పేర్కొంది.
హవాలా మనీతో ఐప్యాక్‌కు సంబంధం ఉం దని, ఇందులో ఓ వ్యక్తికి ఈ సంస్థకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పింది. అయితే అక్క డికి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారిక దర్యాప్తును ‘అడ్డుకున్నారని’ ఆరోపించింది. కోల్‌కతాలో ఈడీ దాడుల సమ యంలో మమతా బెనర్జీ, ఆమె సహాయకు లు వచ్చి భౌతిక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని ఈడీ పేర్కొంది.
ప్రతీక్‌జైన్ నివాసంలోకి ప్రవేశించి కీలక సాక్ష్యాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉండగా, ఎన్నికల వ్యూహకర్తగా, రాజకీయ నాయకుడు ప్రశాం త్ కిషోర్ స్థాపించిన ఐ-ప్యాక్.. బెంగా ల్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరుగుతున్న ఈడీ దాడులను నిలిపివేయాలని కోరింది.
దాడుల వెనుక అమిత్‌షా
ఈ దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. ‘దేశాన్ని సురక్షితంగా ఉంచలేని నీచమైన, దుర్మార్గపు హోంమంత్రి దీని వెనుక ఉన్నారు. అమిత్‌షా మా పార్టీ అభ్యర్థుల జాబితాను సేకరించాలని అనుకుం టున్నారు’ అని మమత విమర్శించారు. ‘వా రు నా పార్టీ పత్రాలను తీసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు.
ఒకవైపు ఎస్‌ఐఆర్ కేసులో పేర్లను తొలగిస్తు న్నారు. మరోవైపు వారు పత్రాలను సేకరిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. రాజకీయ సమాచారాన్ని స్వాధీనం చేసుకోవడం ఈడీ విధి కాదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ‘అభ్యర్థుల జాబితాలు, పార్టీ వ్యూహం, పార్టీ ప్ర ణాళికలను సేకరించడం ఈడీ, హోంమంత్రి విధియా?’ అని ఆమె ఆగ్రహించారు.
సీఎంపై కూడా ఈడీ చర్యలు తీసుకుంటుంది..
కేంద్ర దర్యాప్తు సంస్థ పనికి ఆటంకం కలిగించినందుకు మమతా బెనర్జీపై బీజేపీ నాయకుడు సువేందు మండిపడ్డారు. ‘నేను ఈ దాడిపై వ్యాఖ్యానించను. దాడి ఎందుకు జరుగుతోందో ఈడీయే సమాధానం చెబుతుంది. కేంద్ర సంస్థల పనికి ఆటంకం కలిగించడం మమతా బెనర్జీకి అలవాటు. ఈరోజు మమత చేసింది దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే. ఈడీ తన అధికారాలను ఉపయోగించి ముఖ్యమంత్రిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సోదాలు ఎన్నికలతో సంబంధం లేదు: ఈడీ
మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పందిస్తూ, ఈ సోదాలకు ఎన్నికలకు సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్‌పై జరుగుతున్న సాధారణ చర్యలలో భాగమేనని పేర్కొంది. ‘రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారితో సహా కొందరు వ్యక్తులు 10 చోట్లలోని 2 ప్రాంగణాల్లోకి వచ్చి, తమ పదవులను దు ర్వినియోగం చేసి అక్రమంగా ప్రవేశించి పత్రాలను లాక్కున్నారు’ అని ఈడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ కుటుంబం గురువారం ఈడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో సోదాల సమ యంలో ముఖ్యమైన పత్రాలను దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారని ఓ అధికారి తెలిపారు.
ఆ పచ్చని ఫైల్‌లో రహస్యాలు ఏంటి?
ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వచ్చి, ఓ పచ్చని కవర్‌లోని ఫైళ్లను స్వయానా చేతపట్టుకుని తీసుకెళ్లింది. ఈ ఫైళ్లలోని రహస్యాలు ఏంటని, అంత ఆఘమేఘాల వచ్చి తీసుకుపోవడంలో అంతర్య మేంటని అంతా చర్చింకుంటున్నారు. అం దులో ఏముందని, కుంభకోణానికి, మనీలాండరింగ్‌కు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయా? మరి ఇంకేదైనా రహస్యాలు దాగున్నాయా? అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ డేటా స్వాధీనమే ఈడీ లక్ష్యం: మమత
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పత్రాలు, వ్యూహాత్మక ఫైళ్లను బీజేపీ స్వాధీ నం చేసుకుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఐ-ప్యాక్ కార్యాలయం, కోల్‌కతాలోని ప్రతీక్ జైన్ నివాసంపై దాడులు చేయడాన్ని ఆమె ఖండించారు. దాడుల వార్త తెలియగానే, టీఎంసీ నాయకులు సాల్ట్ లేక్ కార్యాలయం వద్ద గుమిగూడటం ప్రారంభించారు. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య బిధాన్నగర్ పోలీస్ కమిషనర్ కూడా అక్కడికి చేరుకున్నారు.
మొదట ఒక చోట ఉన్న మమతా బెనర్జీ, తర్వాత సెక్టార్ ‘వీ’ కార్యాలయం వైపు వెళ్లారు. దాడుల గురించి తెలుసుకున్న తర్వాత తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నానని ఆమె చెప్పారు. ‘ప్రతీక్ నా పార్టీ పనులకు బాధ్యత వహిస్తున్నందున నేను అతనికి ఫోన్ చేశాను. సెక్టార్ ‘వీ’ లోని నా ఐటీ కార్యాలయంపై ఈడీ దాడి చేసింది’ అని మమత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, తన పార్టీ అంతర్గత రాజకీయ సమాచారాన్ని సేకరించడానికే ఈడీ దాడి చేసిందని ఆరోపించారు. ‘అభ్యర్థుల జాబితాలు, పార్టీ వ్యూహం, ప్రణాళికలు, రహస్య పత్రాలను సేకరించడానికి ఈడీ మా కార్యాలయానికి రావడం చాలా దురదృష్టకరం’ అని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
మమత ఎందుకు తొందరపడింది : బీజేపీ
మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయంలోకి హడావిడిగా నడుస్తూ విలేకరులను పక్కకు నెట్టివేస్తున్న వీడియోను బీజేపీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పత్రాలు, హార్డ్ డిస్క్‌లను సేకరించడానికి ఎందుకు అంత తొందరపడుతున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఇది ‘లోతైన కుట్ర’ను సూచిస్తుందని ట్వీట్ చేసింది.