02-01-2026 08:30:06 PM
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. సీతారాం
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సీతారాం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెబ్బెన సిబ్బందితో పాటు అడిషనల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మహిళా ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ హెచ్ఎంఐఎస్ రిపోర్ట్‌లో గర్భిణీ స్త్రీల ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
గర్భిణీ స్త్రీలకు ఇవ్వాల్సిన టిటి వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్, కాల్షియం మాత్రల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. టిబీ స్క్రీనింగ్ పరీక్షలు, సికిల్ సెల్ పాయింట్ ఆఫ్ కేర్ పరీక్షలు, లెప్రసీ గుర్తింపు, బీపీ, మధుమేహం వంటి కేసుల గుర్తింపుపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పుట్టిన వెంటనే శిశువులకు జీరో డోస్ ఓపీవీ, బీసీజీ, హెపటైటిస్ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయాలని తెలిపారు.గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురికాకుండా సమతుల ఆహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటు, పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా జన్మిస్తారని పేర్కొన్నారు.