బతుకమ్మ, దసరాకు 7,754 స్పెషల్ బస్సులు
- రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు నడపనున్న టీజీఎస్‌ఆర్టీసీ
- ప్రత్యేక బస్సుల్లో సవరణ చార్జీలు వసూలు
- తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు సౌకర్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 స్పెషల్ బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.
సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాంపులైన ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెబీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ర్టం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్ట్టలకు ఈ ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ర్ట ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరించనుంది.
ఈనెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ చార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవి యథావిధిగా ఉంటాయి.
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ వీ సజ్జనార్
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీ సజ్జనార్ తెలిపారు. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ , సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రతీ రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతామని, పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని సజ్జనార్ తెలిపారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో వైట్ నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి, ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు.
టీజీఎస్‌ఆర్టీసీలో ఎంతో అనుభవమున్న డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్ సైట్ (టీజీఎస్‌ఆర్‌టీసీబీయూఎస్.ఇన్)లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040--69440000, 040- -23450033ను సంప్రదించాలని సూచించారు.




